నీళ్ల బకెట్‌లో పడి బాలుడి మృతి
సాంగ్వి(కుభీరు): బుడిబుడి అడుగులు, బోసి నవ్వులతో ఇంట్లో సందడి చేసే కొట్టె ఆదిత్య(16 నెలలు) అనే బాలుడికి అప్పుడే నూరేళ్లు నిండాయి. మరుగుదొడ్డిలో నిలువ ఉంచిన నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన కుభీరు మండలం సాంగ్విలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థుల అశ్రునయనాల మధ్య బాలుని అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికుల కథనం ప్రకారం.. కొట్టె రజిత, యోగేష్ దంపతుల చిన్న కుమారుడు ఆదిత్య ఇంట్లో ఆడుకుంటూ మరుగుదొడ్డి వైపు వెళ్లాడు. అందులోని బకెట్‌లో నిలువ ఉంచిన నీటిలో పడి తలకిందులయ్యాడు. గమనించిన తల్లి అటువైపు వెళ్లి చూసేసరికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు భైంసాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటిగే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ బాలుడి ఇంట్లో మృతదేహాన్ని బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్థులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది.