పులి.. సంరక్షణే సవాల్‌

 


ఆదిలాబాద్‌ : తాను ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యానికి తానే నియంత. తన పరిధిలోకి మరోపులి వచ్చినా ఊరుకోదు. ఓటమిని అంగీకరించదు. అలాంటిది ఒక్కటి కాదు.. మూడు పులులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సంచరిస్తున్నాయి. కవ్వాల్‌ అభయారణ్యం ఏర్పాటు తరువాత కొద్దికాలం పులుల జాడే కన్పించలేదు. కానీ తాడోబా, తిప్పేశ్వర్‌ల నుంచి పులులు కాగజ్‌నగర్‌, వేమనపల్లి, చెన్నూరు, భీంపూర్‌, తాంసి(కె), తాజాగా జైనథ్‌ మండలంలోనూ పులి జాడ కన్పించింది. అయితే వీటిని కవ్వాల్‌ ఆభయారణ్యం వైపు తరలించడంలో అటవీ అధికారుల చర్యలు అంతగా ఫలించలేదు. అందుకు తగినట్టు సిబ్బంది నియామకం జరగలేదు. దీంతో పులులు ఉమ్మడి జిల్లా పరిధిలోకి రావడం మళ్లీ తిరిగి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఉమ్మడి జిల్లాలో పులి సంచారం.. సంరక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాల్సిన అవసరంపై ‘న్యూస్‌టుడే’ కథనం.


ప్రధానంగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్‌గంగ నదీపరివాహక ప్రాంతాల్లో రోజుకో చోట పులి కనిపిస్తూ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి నదుల ప్రాంతానికి పులుల కారిడార్‌గా పేరుంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్‌, మన జిల్లాలోని కవ్వాల్‌ అభయారణ్యాలను పులుల సంరక్షణ కేంద్రాలకు కేంద్రం గుర్తించింది.


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మహారాష్ట్ర నుంచి వస్తున్న పులుల సంచారం స్పష్టంగా కనిపిస్తోంది. గత సంవత్సరం ఆగస్టు 21న బోథ్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే భీంపూర్‌ మండలం పరిధిలోని తాంసి(కె)కు చెందిన బొజ్జె పోసానికి చెందిన ఆవును పులి హతమార్చడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. తూర్పు ప్రాంతమైన చెన్నూరు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కోటపల్లి మండలం షెట్‌పల్లి గ్రామంలో ఏడు ఆవులను చంపేయడం భయాందోళనకు దారితీసింది. ఆ తరువాత పులుల సంచారం కాస్తంత తగ్గిందనుకుంటున్న తరుణంలో ఈ నెలలో తిరిగి కోటపల్లి మండలం నక్కలపల్లిలో పశువుల కాపరి కుర్మ వెంకటిపై పులి దాడి చేయగా... ఆయన ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. మొన్నటి జనవరి 14న భీంపూర్‌ మండలం తాంసి(కె) చెందిన నైతం రవీందర్‌ ఆవులేగదూడను చంపేయడం ప్రజల్లో వణుకు పుట్టించింది. తాజాగా ఆదిలాబాద్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జైనథ్‌ మండలం నిరాల సమీపంలో ఆదిలాబాద్‌-బేల ప్రధాన రహదారిపై పులి కనిపించడం బేల మండలానికి చెందిన అనిల్‌ అనే రైతు చరవాణిలో బంధించడం సంచలనం సృష్టించింది. నిర్మల్‌ -ఖానాపూర్‌ అటవీప్రాంతంలో మరో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ భావిస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా పులుల సంచారం పెరగడం, అడపాదడప పశువులపై దాడులు చేయడంతో పల్లె జనం పొలంవైపు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం ఆగస్టు మాసంలో పులుల సంచారమంతా పెన్‌గంగ, పాలవాగు, గొల్లఘట్‌ వాగు, ప్రాణహిత నదీ పరివాహాక ప్రాంతాల పరిధిలోనే ఉంది.


మహారాష్ట్ర పులులే


జిల్లాలో సంచరిస్తున్నవన్నీ మహారాష్ట్ర పులులే. అక్కడి తాడోబా పులుల అభయారణ్యం విస్తీర్ణం 625.చ.కి.మీటర్ల వైశాల్యంతో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపుగా 40 పులులు ఉన్నాయి. తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్యం 148. చ.కి.మితో విస్తరించి ఉంది. ఇందులో 20 పెద్దపులులు ఉన్నాయి. కానీ కవ్వాల అభయారణ్యం 2015. చ.కి.మీటర్ల వైశాల్యంతో విస్తరించి ఉన్నప్పటికీ పులుల జాడ కనిపించడంలేదు. పులుల స్వభావరీత్యా ఒక్కో పులి 10.చ.కి.మీటర్ల విస్తీర్ణంతో తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు యత్నిస్తుంది. ఇందులో మరో పులి ఆధిపత్యాన్ని అసలే అంగీకరించదు. అందుకే అటు తాడోబానుంచి వస్తున్న పులులు చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రాంతాల మీదుగా చత్తీస్‌ఘడ్‌లోని ఇంద్రావతి అభయారణ్యానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు అటవీశాఖ ప్రాథమికంగా నిర్ధరించింది. తిప్పేశ్వర్‌ అటవీప్రాంతానికి చెందిన పులులు మహారాష్ట్రలోని పాండర్‌కవాడా నుంచి మన ప్రాంతంలోని భీంపూర్‌, తాంసి, తలమడుగు, జైనథ్‌, ఆదిలాబాద్‌ గ్రామీణం, భోథ్‌, ఖానాపూర్‌ మీదుగా కవ్వాల అభయారణ్యానికి వెళ్లే ప్రయత్నం చేస్తుండడం మూగజీవాలపై దాడులకు కారణమవుతోంది. గతంతో పోల్చుకుంటే అటవీ విస్తీర్ణం తగ్గడంతో జనారణ్యంలో వాటి సంచారం కనిపిస్తోంది. సహజంగానైతే పులులు డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన ప్రాంతాలను అన్వేషిస్తాయి. తాడోబా, తిప్పేశ్వర్‌ అనువైన ప్రాంతాలైనప్పటికీ అక్కడి అటవీ విస్తీర్ణం తక్కువ కావడం పులుల మధ్య ఆధిపత్యానికి దారి తీస్తోంది. అందుకే మన జిల్లాలోని తాడోబో, చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యంవైపు వెళ్లే ప్రయత్నం చేయడమే సమస్య తలెత్తడానికి ప్రధాన కారణమనేది అటవీశాఖ వాదన. పులుల రాక ఆహ్వానించే పరిణామమే. కానీ మైదాన ప్రాంతాల్లో దాడులకు యత్నిస్తుండడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంటే అటవీశాఖకు సవాలుగా మారుతోంది.


నిపుణుల సమస్య


పులులను పట్టుకోవడం సహజమైన మానవ ప్రేరేపిత పద్ధతులతో సాధ్యం కాదు. మత్తుమందు(ట్రాంకులైజర్‌) విధానంతోనే పట్టుకోవాల్సి ఉంది. ఈ విధానం అమలు చేస్తే పులి సహజత్వాన్ని కోల్పోతుంది. మన రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌లో ఇద్దరు నిపుణులే ఉన్నారు అనుకున్నంత మంది నిపుణులు లేకపోవడంతో అక్కడక్కడ అనారోగ్యానికి పులులకు వైద్యం చేయాల్సి వచ్చిన ఫీల్డ్‌ డైరెక్టర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. వైశాల్యం పరంగా కవ్వాల అభయారణ్యం దేశంలోనే గురింపు పొందినప్పటికీ ప్రభుత్వ పరంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, ఇచ్చోడ, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ ప్రాంతాలు ఉంటే ఇందులో ఉట్నూర్‌ ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ అటవీ డివిజన్‌ అధికారుల పోస్టులు భర్తీ కాలేదు. ఆ తరువాత కిందిస్థాయి సిబ్బందిలోనూ పదుల సంఖ్యల పోస్టులు భర్తీ కావడం లేదు. ఫలితంగా పులుల సంచారం క్రమంగా పెరుగుతున్నప్పటికీ పర్యవేక్షణ చేయలేక, ప్రజల్లో అవగహన కల్పించలేక అటవీశాఖ ప్రేక్షకపాత్ర పోషించాల్సి వస్తోంది. పులులను వాటిమార్గాన వాటిని వెళ్లేలా చేయాల్సి వస్తోంది.