కమలం కమిలింది ఎందుకు?

జనం నాడి మరిచి... నేల విడిచి సాము!
గల్లీల్లోనూ జాతీయ ముచ్చట్లు వినిపించిన భాజపా నేతలు



దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ స్థానాలన్నింటినీ గెలుచుకున్న భాజపా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి కారణం జనం నాడి మరచి.. నేల విడిచి సాము చేయడమే! క్షేత్రస్థాయి సమస్యలపై కాకుండా.. పాకిస్థాన్‌, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ.. ఇలాంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడటాన్ని ప్రజలు పట్టించుకోలేదు. పైపెచ్చు కొందరు పార్టీ నేతల రెచ్చగొట్టే ప్రకటనలు భాజపాను మరింతగా దెబ్బతీశాయి. ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం, ఆమ్‌ ఆద్మీకి కాంగ్రెస్‌ పరోక్షంగా సహకరించడమూ(?) భాజపాకు నష్టం చేకూర్చాయంటున్నారు. ప్రచారానికి వచ్చిన ఇతర ప్రాంతాల భాజపా నేతలకు దిల్లీ సమస్యలపై అవగాహన లేకపోవడం ఒకటైతే... ఏం ప్రచారం చేయాలనే దానిపై స్పష్టత కరవవడం మరో సమస్య.


మనసుకు పట్టని ప్రచారాంశాలు
దిల్లీలో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారికి రేషన్‌ కార్డుల్లేవు. ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికే వారే ఎక్కువ. వచ్చిన దానిలో నెలకు రూ.3-4 వేల వరకు మిగుల్చుకొని తమ కుటుంబాలకు పంపుతుంటారు. ఆప్‌ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు కరెంట్‌ బిలు,్ల నిర్దిష్ట పరిమితి వరకు నీళ్ల బిల్లు లేకపోవడం, జ్వరం, ఇతర చిన్న రుగ్మతలకు మొహల్లా క్లీనిక్‌లు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇలాంటి సంక్షేమ పథకాలతో ముందుకొచ్చింది. సగటున ఒక్కో కుటుంబానికి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు మిగులుతోంది. దీంతో మధ్య తరగతి, పేదలు, వలస జీవుల్లో అత్యధికులు ఆప్‌ వైపే మొగ్గుచూపారు. మతం, ప్రాంతం, జాతీయత అంశాలు, మోదీ, అమిత్‌షా సాధించిన విజయాలు.. జన్‌ధన్‌ ఖాతాలు...ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వంటి అంశాలపైనే భాజపా నాయకులు ప్రచారం చేశారు తప్ప ఎక్కడా ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఈ ఎన్నికల్ని సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై రెఫరండం అని కూడా ప్రచారం చేశారు.దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు, విభిన్న భాషలు, యాసలు మాట్లాడే నేతలందరినీ ఆయా ప్రాంతవాసులు నివసించే ఇంటింటికీ తిప్పినా ఫలితంలేకపోయింది.


గోలీ మారో...
కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఓ ప్రచార సభలో షాహీన్‌బాగ్‌ నిరసనలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘దేశ్‌ కో గద్దారోం కో(దేశ ద్రోహులకు)’ అని అంటుంటే.. కార్యకర్తలు ‘గోలి మారో(కాల్చేయండి)’ అంటూ ప్రతి నినాదాలు చేశారు. భాజపా ఎంపీ పర్వేష్‌ వర్మ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హిందూ ఓటు బ్యాంకును ఏకంచేసే లక్ష్యంతోనే వీరు ఇలా ప్రచారం చేయడం మేధావి వర్గాన్ని మరింత దూరం చేసింది.


కాంగ్రెస్‌ దెబ్బతీసింది!
చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ బలహీన అభ్యర్థుల్ని పోటీపెట్టింది. అది బలంగా ఎన్నికల్ని ఎదుర్కొని ఉంటే.. ఆప్‌ దెబ్బతిని.. తాము లాభపడేవాళ్లమని కమలనాథులు అంటున్నారు.


కాలుష్యంపై విమర్శలు వికటించి...
దిల్లీ ప్రజల్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య కాలుష్యం. పొరుగున ఉన్న హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో దిల్లీలో ప్రతి శీతాకాల ఆరంభంలో కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ దహనాన్ని మాన్పించేలా చూడాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆప్‌ ప్రభుత్వం విజ్ఞప్తిచేస్తున్నా ప్రయోజనం శూన్యం. ఆ రెండూ భాజపా పాలిత రాష్ట్రాలే. ఈ సమస్యపై భాజపా కేంద్ర నాయకత్వం ఎన్నడూ పెదవి విప్పలేదు. ఎన్నికల ప్రచారంలో భాజపా నాయకులు కాలుష్యంపై విమర్శలు చేసిన ప్రతిసారీ ఆప్‌ ఎదురుదాడికి దిగింది. పొరుగు రాష్ట్రాల వైఫల్యాన్ని ఎత్తిచూపింది.




విద్యార్థులూ ఓటేయలేదా?


సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ లాంటి చోట్ల పెద్దఎత్తున నిరసనలు తలెత్తాయి. విద్యార్థులపై పోలీసులు భారీగా లాఠీఛార్జి చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 శాతం మంది యువత ముఖ్యంగా విద్యార్థులు భాజపాకు దూరం జరిగారని ఓ సర్వేలో తేలింది.