
అమెరికాలో కరోనా మృతి నమోదైంది. వాషింగ్టన్ రాష్ట్రంలోని కిర్క్‌లాండ్ సిటీలో కరోనా వైరస్ డిసీజ్ (కోవిడ్-19) బారిన పడిన ఓ 50 ఏళ్ల మహిళ శనివారం మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే ఆమె కోవిడ్ రాక ముందు నుంచే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోందని వాషింగ్టన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. వైరస్ సోకడంతో కిర్క్‌లాండ్‌లోని ఎవర్‌గ్రీన్ హెల్త్ హాస్పిటల్‌లో చేరిన ఆమె అక్కడ చికత్స పొందుతూ శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. సిటీ దాటని ఆమెకు వైరస్ ఎలా వచ్చిందన్న విషయం తెలియలేదని అధికారులు చెప్పారు. వాషింగ్టన్‌లో తొలి కరోనా మృతి నమోదవడం చాలా బాధాకరమని ఆ రాష్ట్ర గవర్నర్ జయ్ ఇన్‌స్లీ అన్నారు. మృతురాలి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
ఒకే హాస్పిటల్‌లో 50 మందికి…
కిర్క్‌లాండ్‌లోని లైఫ్ కేర్ సెంటర్ అనే ఆస్పత్రిలో 50 మందికి కరోనా లక్షణాలను గుర్తించారు డాక్టర్లు. వారిలో చాలా మంది నర్సులు, హెల్త్ కేర్ స్టాఫ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హాస్పిటల్ కరోనా బాధితులను క్వారంటైన్ చేసి చికిత్స అందిస్తున్న సెంటర్ అని, ఇక్కడ చేరిన పేషెంట్ల నుంచి వైరస్ వ్యాపించినట్లుగా అనుమానిస్తున్నామని వాషింగ్టన్ కమ్యూనికబుల్ డిసీజ్ సెంటర్ అధికారి డచిన్ తెలిపారు. వారందరికీ టెస్టులు చేయగా.. ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలిందని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు చైనాలో 2800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 80 వేల మంది చికిత్స పొందుతున్నారు. అక్కడి వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు వ్యాప్తించింది. అమెరికాలో మొత్తంగా 60 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక భారత్‌లో ముగ్గరురికి కరోనా ఉందని తేలగా.. చికిత్స పొందిన తర్వాత పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు.