ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్ పట్టణంలో పట్టణ ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పనులు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. అధికారులు, పాలకవర్గ ప్రతినిధులు వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ మేరకు పరిష్కరించే ప్రయ త్నం చేస్తున్నారు. ఆరోగ్యవంత వాతావరణ, పారిశుద్ధ్యం పనులు, హరితహారం మొక్కల సంరక్షణ ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి ఈ పనులను పకడ్బందీగా చేపడుతున్నారు.
ఉద్యమంలా ప్రణాళిక..
పట్టణ ప్రణాళిక పనులు ఉద్యమంలా కొనసాగుతున్నా యి. ఆరో రోజు శనివారం మున్సిపల్ పరిధిలోని 49వార్డుల్లో పనులు కొనసాగాయి. 12 వార్డు పాత హౌసింగ్ బోర్డు కాలనీని కలెక్టర్ శ్రీదేవసేన సందర్శించారు. కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం కాలనీ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకొని పారిశుద్ధ్యం, హరితహారంపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డేవిడ్ పలు వార్డుల్లో పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ శాంతినగర్ కాలనీలో పనులను పరిశీలించి వార్డుప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని అప్పటికప్పుడే పరిష్కరించారు. వైస్ చైర్మన్ జహీర్‌రంజాని ఖానాపూర్ కాలనీలో పర్యటించి ప్రత్యేక అధికారితో కలిసి పనులను పరిశీలించారు. 23 వార్డులో మున్సిపల్ కమిషనర్ పర్యటించి పనులను పరిశీలించారు. 17 వార్డులో జడ్పీ సీఈవో, ప్రత్యేక అధికారి పనులను పర్యవేక్షించారు. 38 వార్డులో ప్రత్యేక అధికారి మధుసుదనాచారి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉత్తమ్‌కుమార్‌జాడే, అర్చన రామ్‌కుమార్ పనులు పరిశీలించారు. వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేశారు.
మెరుగుపడుతున్న సౌకర్యాలు..
ప్రగతి పనుల్లో భాగంగా మురికినాళీల్లో పూడిక తీత, హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఏండ్లుగా పాడుబడ్డ భవనాలు ప్రమాదకరంగా ఉన్న వాటిని కాలనీవాసుల సూచన మేరకు కూల్చివేస్తున్నారు. ఖాళీ స్థలాల్లో ఉన్న పిచ్చిమొక్కలు, ముళ్లపొదల తొలగింపునకు యజమానులకు నోటీసులు ఇచ్చారు. విలీన గ్రామాలు మావల జీపీ, బట్టి సావర్గాంలో కొన్ని వార్డుల్లో అక్కడక్కడ ఉన్న ముళ్లపొదలను తొలగించారు. ప్రమాదకరంగా వంగిన కరెంట్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. మూడో లైన్ వైరు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో పట్టణంలో ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడుతుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.