మానవుడి తప్పిదాల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. ఫలితంగా భూమిపై మనిషితోపాటు జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పర్యావరణ పరిరక్షణ మానవుడితోనే సాధ్యమని ఆలోచించారు.. ఆ విద్యార్థులు. తమ ఆలోచనలకు పదునుపెట్టి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా లఘుచిత్రం రూపొందించారు. మానవ తప్పిదాల వల్ల పర్యావరణం ఎంత వరకు కలుషితం అవుతుంది. దీని వల్ల మనకు, జీవరాశులకు కలిగే ఇబ్బందులను ఇందులో వివరించి ఆదర్శంగా నిలిచారు ముదిగొండ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థులు.
ప్లాస్టిక్ వినియోగంతో మనుగడ ప్రశ్నార్థకం..
పల్లెల్లో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. కిరాణ సరకులు దగ్గర నుంచి టీగ్లాసులు, నీళ్ల సీసాలు, వాటర్ ప్యాకెట్‌లు, తినుబండారాల కవర్లు ఇలా ప్రతి అవసరం ప్లాస్టిక్‌తోనే ముడివడిపోయింది. ఇలా రోజురోజుకు పెరుగుతున్న వీటి వ్యర్థాలు పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నాయి. ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా ప్రజలను చైతన్యం చేయాలని విద్యార్థులు నిర్ణయించారు. ఎవాయిడ్ ప్లాస్టిక్(ప్లాస్టిక్‌ను నివారిద్దాం) పేరుతో ముదిగొండ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు లఘుచిత్రం రూపొందించారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నందిగామ మహేశ్, చరణ్, అనూప్, యోగానంద్, రోహిత్, అభిషేక్ 9వ తరగతి చదువుతున్నారు. మిషన్ ప్లాస్టిక్ ఫ్రీ ఖమ్మానికి లఘుచిత్రం రూపొందించాలని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు వెంకట్రామిరెడ్డి సూచించారు. దీంతో విద్యార్థులు దీన్ని రూపొందించాలని నిర్ణయించారు.
ప్లాస్టిక్ నిర్మూలనే ఇతివృత్తం
కాలుష్యాన్ని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలి. ముఖ్యంగా వాడకాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో లఘుచిత్రం రూపకల్పన చేశారు. పాలిథిన్ కవర్లు కొన్నివేల సంవత్సరాల వరకు భూమిలో విలీనం కావు... మానవులు వాడిపడేసిన ఈ వ్యర్థాలను పశువులు తినడం వల్ల అవి చనిపోతున్నాయి. చేయిచేయీ కలుపుదాం.. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం అనే ఆలోచనతో లఘుచిత్రం రూపొందించారు. నష్టాలను ప్రజలకు తెలియజేయాలని కథ సిద్ధం చేసుకుని చిత్రీకరణ చేపట్టారు. ఇందులో నటించిన వారంతా విద్యార్థులే. చరవాణితో చిత్రీకరణ పూర్తి చేశారు. విద్యార్థులే నటించి అనర్థాలను వివరించారు. ప్రజలను కలిసికట్టుగా చైతన్యం చేద్దామని నిర్ణయించారు. విద్యార్థులు ఎక్కువ దూరం వెళ్లకుండా ముదిగొండ పారిశ్రామిక ప్రాంతం, చెరువు వద్ద దృశ్యాలను చిత్రీకరించారు. విద్యార్థులు రూపొందించిన ఈ లఘుచిత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు వెంకట్రామిరెడ్డి జిల్లా అధికారులకు పంపించారు. దీన్ని చూసిన పలువురు విద్యార్థులను అభినందించారు. జాయింట్ కలెక్టర్ హనుమంత్ కోడింబా, అసిస్టెంట్ కలెక్టర్ ఆదర్శ సురభి చిత్రంలో నటించిన నందిగామ మహేశ్‌కు ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.