ఖమ్మం: మూడు నెలల్లో ఖమ్మం పట్టణంలో 400 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ప్రతి డివిజన్‌లో హరితప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పారు. నాటిన మొక్కల్లో 85శాతం బతకకపోతే కార్పొరేటర్ల పదవులు పోతాయని హెచ్చరించారు. ఖమ్మం పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి పనుల్ని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
'ఖాళీ స్థలాల్లో చెత్త, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. కొత్త పార్కుల నిర్మాణం, ఉన్న పార్కులను అభివృద్ధి చేయాలి. వాటర్ ఆడిట్‌ను నిర్వహించాలి. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నివారించాలి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చూద్దామన్నా..చెత్త కనిపించదు. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదు. 600 గజాల వరకు ఇంటి నిర్మాణానికి ఆన్‌లైన్‌లోనే అనుమతి మంజూరు చేస్తాం. అనుమతుల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేదు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఏప్రిల్ 2న టీఎస్ బీపాస్ పథకం ప్రారంభిస్తామని' వివరించారు.
'నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాణాలు కూల్చేస్తాం..25 రెట్ల జరిమానా విధిస్తాం. ప్రతినెల కార్పొరేషన్ సమావేశం, మూడు నెలలకు డివిజన్ సమావేశం ఉంటుంది. ప్రతి కార్పొరేటర్ ఒక్కొక్క కేసీఆర్ అయితే పట్టణం మారుతుంది. ప్రజాప్రతినిధుల ఉద్యోగాలు పోవడం చట్టంలోనే ఉంది.. ఎవరూ మార్చలేరు. పార్కులు, పచ్చదనానికి 10శాతం నిధులు కేటాయించాలి. ప్లాస్టిక్‌ను దూరం చేయండి..జూట్ సంచులు అందించండి. మున్సిపల్ చట్టం ప్రకారం సిబ్బంది ఉదయం 5:30 గంటలకు విధుల్లో ఉండాలని' కేటీఆర్ పేర్కొన్నారు.