అమరావతి ఆంధ్రుల ఆశ, ఆకాంక్షలకు కేంద్ర బిందువు
పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా జలాన్ని తెచ్చా
దేశ రాజధానినే అమరావతిలో కలిపేశా
ఆంధ్రప్రదేశ్ వికాస యాత్రలో భుజం భుజం కలిపి నడుస్తాం
రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో నాడు ప్రధాని మోదీ భరోసా
హాజరైన ప్రముఖులందరి నోటా అమరావతి మాటే
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి నగరానికి సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి వస్తూ పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని, యమునా నది జలాలను తన వెంట తీసుకొచ్చారు. అవి రెండూ దేశ రాజధానిని అమరావతిలో కలిపేశామనడానికి సంకేతాలని చెప్పారు. కొత్తగా నిర్మించబోయే అమరావతి నగరం ఆంధ్రుల ఆశ, ఆకాంక్షలకు కేంద్ర బిందువుగా ఉంటుందని, ఇదో ప్రజా రాజధానిగా రూపుదిద్దుకోబోతోందని ఉద్ఘాటించారు. రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2015, అక్టోబరు 22న జరిగిన అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ భావోద్వేగంగా ప్రసంగించారు.
....ఒక్క ప్రధానే కాదు, నాటి కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, గవర్నర్లు, తెలంగాణ ముఖ్యమంత్రి, విదేశీ ప్రముఖులు... ఇలాంటి మహామహులెందరో ఆ మహోత్సవానికి అతిథులుగా హాజరై కొత్త రాజధాని నిర్మాణానికి శుభాకాంక్షలు అందజేశారు. అమరావతి నగరం అజరామరమై చరిత్రలో నిలుస్తుందని ఇప్పటి ఉప రాష్ట్రపతి, నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, ప్రపంచంలోనే అద్భుత నగరంగా నిర్మాణం సాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. నగర నిర్మాణంలో భాగస్వాములం అవుతామని జపాన్, సింగపూర్ మంత్రులూ భరోసా ఇచ్చారు. వీరందరి శుభాకాంక్షలతో మార్మోగిన ఆ శంకుస్థాపన కార్యక్రమానికి విశేష ప్రాధాన్యం ఉంది. నాడు ప్రధాని, ఇతర ప్రముఖులు ఇచ్చిన హామీలు, చేసిన బాసలకు ఏమాత్రం విలువ లేనట్లుగా ప్రస్తుత వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో... అసలు అమరావతి శంకుస్థాపనకు హాజరైన అగ్ర నేతలు ఏం చెప్పారు? ప్రపంచస్థాయి నగర నిర్మాణానికి ఎలాంటి భరోసా ఇచ్చారు? అనే అంశాలను ఒక్కసారి అవలోకనం చేసుకుంటే....
నూతన అధ్యాయంలోకి ఆంధ్రప్రదేశ్: మోదీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెబుతున్నా... పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని, యమునా నది పవిత్ర జలాన్ని తెచ్చి ముఖ్యమంత్రికి అందజేశాను. ఇక్కడికి తెచ్చింది కేవలం ఈ రెండే కాదు... అమరావతికి దేశ రాజధానే చేరిందని, రాష్ట్ర రాజధానిలో కలవడానికి వచ్చిందన్నది దీని సందేశం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో దిల్లీ అడుగడుగునా భుజం భుజం కలిపి నడుస్తుందని, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నది దీని విస్పష్ట సంకేతం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి తక్కువ నగరాలను మాత్రమే కొత్తగా నిర్మించగలిగాం. ఈ రోజు వాటి అవసరం ఉంది. పట్టణీకరణ, నగరాభివృద్ధిని ఓ సమస్యగా కాకుండా... మహత్తర అవకాశంగా మలచుకోవాలి. అందుకే ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశంలో 100 ఆకర్షణీయ నగరాలను తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇవి ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి, సంపద సృష్టికి దోహపడతాయి. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల వీటి ప్రధాన ఉద్దేశం. అత్యాధునిక రవాణా వ్యవస్థ, కార్యాలయాలకు నడిచి వెళ్లగలిగే సౌలభ్యం ఈ నగరాల్లో ఉంటుంది. అలాంటి ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి అమరావతి ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నా.
శతాబ్దాల సంస్కృతి, చారిత్రక వైభవంతో తులతూగిన అమరావతి ఇప్పుడు ప్రజా రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది. ఆనాటి చారిత్రక వైభవాన్ని మేళవించి, సరికొత్త ఆధునికతను సంతరించుకుని ఆంధ్రుల ఆశ, ఆకాంక్షలకు కేంద్ర బిందువుగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యాయంలోకి ప్రవేశిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలో ఎక్కడెక్కడ మంచి ఆచరణలు ఉన్నాయో వాటన్నింటినీ సేకరించి, జోడించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
కొత్త నగరాల నిర్మాణం సవాల్‌తో కూడుకున్నదే
కొత్త నగరాల నిర్మాణం ఎంతో శ్రమతో కూడుకున్నదని జపాన్ అనుభవాలు చెబుతున్నాయి. అలాంటి అనుభవం నాకూ ఉంది. 2001లో గుజరాత్‌లో భయంకరమైన భూకంపం వచ్చి కచ్ జిల్లాతోపాటు గుజరాత్‌లోని పలు పట్టణాలకు పట్టణాలే ధ్వంసమయ్యాయి. నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటి పునర్నిర్మాణాన్ని సవాల్‌గా తీసుకున్నా. రాజకీయ సంకల్పం, ప్రజా మద్దతు, స్పష్టమైన ప్రణాళికతో పునర్నిర్మాణం చేపట్టగలిగాం. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల జాబితాలో కచ్ స్థానం సంపాదించింది.
ప్రాంతాలు వేరైనా తెలుగువారి ఆత్మ ఒకటే
ఆంధ్రప్రదేశ్ అయినా.. తెలంగాణ అయినా... ఆత్మ మాత్రం తెలుగు అని గుర్తుంచుకోవాలి. రెండు ఆత్మలు అభివృద్ధిలో పోటీ పడితే దేశం శక్తిమంతంగా తయారవుతుంది. కేంద్రం చేపట్టిన స్టార్టప్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగల సత్తా తెలుగు గడ్డకు మాత్రమే ఉంది.. ఆంధ్ర, తెలంగాణలు వేరు పడినప్పటికీ భుజం భుజం కలిపి పనిచేస్తే బలంగా ఎదిగే అవకాశం ఉంది. అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించినప్పుడు నేను సంతోషంగా అంగీకరించాను. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించారని ప్రసారమాధ్యమాల ద్వారా తెలిసి ఎంతో ఆనందించా.
ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు నెరవేరుస్తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంది. ఇక్కడుండే మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకెళ్తుంది. చంద్రబాబు ఆ దిశగా ముందడుగు వేశారు. మీరు నిశ్చింతగా ఉండండి. చంద్రబాబు, నరేంద్రమోదీ జోడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల్ని సాకారం చేస్తుంది.