హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్‌పై .. ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ..రానున్న 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరో బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మపైన కూడా ఈసీ వేటు వేసింది. ఎంపీ పర్వేశ్‌పై 96 గంటల నిషేధం విధించింది. ఇటీవల ఓ బహిరంగసభలో మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని కేంద్రమంత్రి అనురాగ్ తప్పుపట్టారు. దేశద్రోహులను తరిమికొట్టాలన్నారు. దేశ్ కే గద్దారోంకో అంటూ మంత్రి నినాదం ఇవ్వగానే.. అక్కడ ఉన్న జనం అంతా గోలీ మారో అంటూ అరిచారు. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఆ ఫిర్యాదుపై ఇవాళ ఈసీ ఆదేశాలిస్తూ.. అనురాగ్‌పై ప్రచార నిషేధం విధించింది. ఎంపీ పర్వేశ్ వర్మ కూడా ఓ సభలో మాట్లాడుతూ.. సీఏఏ ఆందోళన చేపడుతున్నవారు ఇండ్లల్లోకి వచ్చి రేప్ చేసినా.. ఆ తర్వాత మోదీ కాపాడలేరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.