కరోనా కలవరం!


  • చైనాలో 106కి చేరిన మృతుల సంఖ్య.. 4,515 మందిలో వైరస్‌ లక్షణాలు

  • హుబెయిలో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి భారత్‌ చర్యలు


  • న్యూఢిల్లీ: చైనాలో మొదలై ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నది. చైనాలో ఈ వైరస్‌ తో మృతిచెందినవారి సంఖ్య 106కి చేరుకున్నది. మరో 4,515 మందికి ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు చెప్పారు. సోమవారం నాడే 24 మంది మృతిచెందినట్లు ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి. సోమవారంనాటికి మొత్తం 4,515 మంది కరోనా  వ్యాధికి గురయ్యారు. వీరిలో 2,557 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్లలో 563 మంది తీవ్ర అనారోగ్యంతోనూ, 127 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు హుబెయి రాష్ట్ర  వైద్య కమిషన్‌ మంగళవారం పేర్కొంది. సోమవారమే హుబెయి నుంచే 31,934 మంది దవాఖానల్లో చేరినట్టు ఓ మీడియా సంస్థ తెలిపింది. చైనా రాజధాని బీజింగ్‌, షాంఘై నగరాలకూ కరోనా వ్యాపించింది. కరోనాపై సమీక్షకు సోమవారం చైనా చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్‌ వ్యాధి ఉద్ధృతిపై అధికారులతో ఆరా తీశారు. చైనాలో చిక్కుకున్న తమ పౌరులను ఆయా దేశాలు వెనక్కి పిలవడంపై టెడ్రోస్‌ అభ్యంతరం తెలిపారు. దీనిపై అన్ని విష యాలను వెల్లడిస్తున్నామని టెడ్రోస్‌తో భేటీలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అన్నారు.



    పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి


    కరోనా విదేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తున్నది. థాయిలాండ్‌లో ఏడుగురు, జపాన్‌(3), దక్షిణ కొరియా(3), అమెరికా(3), వియత్నాం(2), సింగపూర్‌(4), మలేషియా(3), నేపాల్‌(1), ఫ్రాన్స్‌(3), ఆస్ట్రేలియా(4), శ్రీలంకలో ఒక్క రు చొప్పున దీని బారిన పడ్డట్టు ఆయా దేశాలు ప్రకటించాయి. చైనా నుంచి వచ్చే పర్యాటకులకు ‘వీసా ఆన్‌ అరైవల్‌(వచ్చిన వెంటనే వీసాను మంజూరుచేయడం)’ సేవల్ని శ్రీలంక రద్దు చేసింది. చైనా నుంచి వచ్చిన ఓ సహోద్యోగి ద్వారా మరో ఉద్యోగికి కరోనా సోకిన ఘటన జర్మనీలో జరిగింది. మరోవైపు వుహాన్‌లో  దాదా పు 2000 మంది పాక్‌ విద్యార్థులు చిక్కుకున్నారు. తమను వెంటనే తీసుకెళ్లాలని వాళ్లు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు విజ్ఞప్తి చేసినట్టు మీడియా తెలిపింది. కరోనా వైరస్‌ 16 దేశాలకు వ్యాప్తి చెందిందని, ఆ దేశాల్లో మొత్తం 37 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.


     


    చైనా నుంచి వచ్చేవాళ్లు 14 రోజులు క్వారెంటైన్‌లో!


    చైనా నుంచి వచ్చే పౌరులు 14 రోజులు క్వారెంటైన్‌ (వైద్యుల పర్యవేక్షణ)లో ఉండాలని కేంద్రం సూచించింది. కరో నా వెలుగుచూసిన చైనాలోని హుబెయి లో చిక్కుకున్న భారతీయులను రప్పిం చడానికి కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకు సహకరించాలని చైనాకు విజ్ఞప్తి చేసింది. హుబెయిలో దాదాపు 250 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం. మరోవైపు కరోనా బాధితులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 20 విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్టు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.