కరీంనగర్‌ మేయర్‌గా సునీల్‌రావు


 కరీంనగర్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌గా తెరాసకు చెందిన వై.సునీల్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఎన్నికను నిర్వహించారు. ఈనెల 27న వెలువడిన ఫలితాల్లో 33 స్థానాల్ని కైవసం చేసుకున్న తెరాస ఇక్కడి మేయర్‌ పీఠాన్ని అందుకుంది. స్వతంత్రులుగా గెలిచిన నలుగురితో పాటు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి విజేతలుగా నిలిచిన ముగ్గురు కూడా తెరాసలో చేరడంతో ఆ పార్టీ బలం 40కి పెరిగింది. దీంతో మేయర్‌ ఎన్నికకు వీరంతా గులాబీ కండువాలతో హాజరయ్యారు. భాజపా నుంచి గెలిచిన 13 మంది సభ్యులతోపాటు ఆరుగురు ఎంఐఎం అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మేయర్‌ అభ్యర్థి ప్రకటన విషయాన్ని ముందు నుంచి గోప్యంగా ఉంచారు. ఎన్నికకు కొంతసేపు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌లు మేయర్‌గా సునీల్‌రావు పేరుని ఖరారు చేశారు. దీంతో తెరాస కార్పొరేటర్లు మేయర్‌గా వై.సునీల్‌రావును, డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపారాణిని ఎన్నుకున్నారు. తొలుత గెలిచిన కార్పొరేటర్లందరి చేత జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్‌లాల్‌ ప్రమాణం చేయించారు.