ప్రతిష్ఠాత్మకంగా పురపాలక చట్టం అమలు
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు ·కేటీఆర్
(ఆరోగ్యజ్యోతి) సిరిసిల్ల : అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని.. పనిచేసే నాయకులను ఓట్లతో ఆశీర్వదిస్తే.. రాష్ట్రంలో పట్టణాలను అభివృద్ధిబాట పట్టించడం సులువవుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చెప్పారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో శనివారం నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన మాట్లాడారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలోని పురపాలికలను దేశంలోనే ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు కులం, మతం అంటూ ప్రచారం మొదలు పెడుతున్నాయన్నారు. భాజపాకు ఓటేస్తే.. డబ్బాలో రాళ్లువేసి ఊపినట్లు ఉంటుంది తప్ప.. చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ పథకానికి రూ.19వేల కోట్లు.. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతిఆయోగ్ సిఫార్సు చేసిందని, నేటికీ ఒక్క పైసా మంజూరు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. ‘ముళ్లచెట్టుకు నీళ్లుపోసి.. పండ్ల చెట్టు నుంచి పండ్లు రావాలంటే వస్తాయా?’ అంటూ.. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోలేని కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే అది వృథాగా పోతుందన్నారు. రాష్ట్రంలో పురపాలికల అభివృద్ధికి శాసనసభలో ప్రత్యేక బడ్జెట్‌ను తీసుకువస్తున్నట్లు చెప్పారు. పచ్చదనం, పరిశుభ్రతకు గ్రీన్ బడ్జెట్‌లో పదిశాతం నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలోని పురపాలికలకు ప్రతి నెలా రూ.216 కోట్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజాసేవను విస్మరిస్తే.. వారిని పదవుల నుంచి తప్పించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రజలకు అవినీతి రహిత పారదర్శక పాలనను అందించడంలో కొత్త పురపాలక చట్టంలో అనేక అంశాలను పొందుపరిచామన్నారు. రోడ్‌షోల్లో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు, పార్టీ రాష్ట్రకార్యదర్శి గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.