దంత వైద్య విద్యకూ ‘నెక్స్ట్‌’ జాతీయ దంత కమిషన్‌ నూతన బిల్లు నమూనా విడుదల

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) తరహాలోనే ‘జాతీయ దంత కమిషన్‌(ఎన్‌డీసీ)’ను కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానుంది. దీనికి సంబంధించిన బిల్లును రూపొందించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ.. తొలుత ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నమూనా బిల్లును బుధవారం విడుదల చేసింది. ఈ ఎన్‌డీసీ బిల్లుపై ప్రజలు, భాగస్వాములు ఎవరైనా తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను వచ్చే నెల 20 లోపు పంపించాలని సూచించింది.


బిల్లులోని ముఖ్యాంశాలివీ..
ఇక నుంచి భారతీయ దంతమండలి స్థానంలో జాతీయ దంత కమిషన్‌ ఏర్పాటు కానుంది.
దీనిలో ఒక ఛైర్‌పర్సన్‌(తప్పనిసరిగా దంత వైద్యుడై ఉండాలి), ఏడుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు, 22 మంది తాత్కాలిక సభ్యులుంటారు.
దంత వైద్యవిద్యలో ప్రవేశాలకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)లో సాధించిన మార్కులనే ప్రామాణికంగా పరిగణిస్తారు.
ఎంబీబీఎస్‌ వైద్యవిద్యార్థుల మాదిరిగానే దంత వైద్యవిద్యార్థులు కూడా ఆఖరి సంవత్సరంలో ‘నెక్స్ట్‌’ను రాసి ఉత్తీర్ణత సాధించాలి. దానిలో పాస్‌ అయితేనే దంత వైద్యుడిగా సేవలందించడానికి అర్హులవుతారు.
నెక్స్ట్‌లో ఉత్తీర్ణతనే పీజీ దంత వైద్యవిద్యలో ప్రవేశాలకు అర్హత.
విదేశాల్లో దంత వైద్యను అభ్యసించిన విద్యార్థులు సైతం నెక్స్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.