● పుర పోరులో కొలిక్కి వస్తున్న పొత్తులు
● తెరాసతో పోటీకి సై అంటున్న విపక్షాలు
ఖమ్మం: పురపాలక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగియడంతో పార్టీలన్నీ పొత్తులపై దృష్టి సారించాయి. అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీ బలంగా ఉండటంతో తెరాసను ఢీకొనేందుకు విపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఉభయ జిల్లాల్లోని అయిదు పురపాలకాల్లో ఆయా పార్టీల బలాలకనుగుణంగా సీట్లను సర్దుబాటు చేసుకొని తెరాస అభ్యర్థులను ఢీకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అయిదు పురపాలకాలను ఒంటి చేత్తో గెలవాలని తెరాస వ్యూహం పన్నుతుంటే.. అధికార పార్టీని నిలువరించి విజయ బావుటా ఎగరేయాలని కాంగ్రెస్, తెదేపా, వామపక్ష పార్టీలు ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని అయిదు మున్సిపాలిటీల్లో రాజకీయ వేడి రాజుకొంది. అధికార పార్టీ జోరుకి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్, తెదేపా, సీపీఎం ఏకమయ్యాయి. బలమైన మూడు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావడంతో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర పురపాలకాల్లో రాజకీయం రసకందాయంలో పడింది. ఈ పట్టణాల్లో మూడు పార్టీలకు బలమైన కార్యకర్తలున్నారు. సత్తుపల్లిలో తెరాస టికెట్ ఆశిస్తున్న పలువురు ఒక్కో వార్డు నుంచి ముగ్గురు కంటే ఎక్కువ సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వీరిలో ఒకరికే తెరాస బి-ఫాం దక్కుతుంది. మిగతా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది నిరుత్సాహానికి గురికావడం సహజం. ఫలితంగా తెరాసకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. సత్తుపల్లిలో తెదేపా బలంగా ఉంది. కాంగ్రెస్ కూడా జత కట్టడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. మధిర పురపాలకంలోనూ తెదేపా, కాంగ్రెస్, సీపీఎం బలంగా ఉన్నాయి. ఇక్కడ భట్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో బలమైన పోటీకి ఆస్కారం ఉండనుంది. వైరాలోనూ కాంగ్రెస్, తెదేపా, న్యూడెమోక్రసీలు ఏకమయ్యాయి. కొత్తగూడెం పురపాలకంలో తెరాసలో టికెట్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉంది. దీంతో అసంతృప్తులను బుజ్జగించడం తలనొప్పిగా మారింది. తెరాస బి-ఫాంలు అందగానే మిగతా వారంతా ఒక్కసారిగా అసంతృప్తిని వెల్లడించే అవకాశాలు లేకపోలేదు. స్థానికంగా కాంగ్రెస్, తెదేపా, సీపీఎం ఏకం అయ్యాయి. గతంలో వైస్‌ఛైర్మన్ పదవిని తెదేపా దక్కించుకున్న విషయం తెలిసిందే. భాజపా కూడా గెలిచే స్థానాల్లో పోటీకి దింపి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇల్లెందులో పొత్తులు కొలిక్కి రాలేదు. కాంగ్రెస్, సీపీఎం ఓ అవగాహనకు వచ్చాయి. న్యూడెమోక్రసీ ఒంటరిగా వెళ్లాలని ఇప్పటి వరకు భావిస్తోంది. తెదేపాదీ కూడా అదే ధోరణి. తెరాసలో రెండు ప్రధాన వర్గాలలో కొట్లాటలను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించే ‘పని’లో పడ్డాయి. మొత్తానికి మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు పురపాలక ఎన్నికల్లో తెరాసలో నెలకొన్న టికెట్ల పంచాయితీని ప్రతిపక్షాలు ఎంత వరకు తమకు అనుకూలంగా మార్చుకొంటాయో వేచి చూడాలి.
ఉపసంహరణ వరకు బి-ఫాంల గడువు
ఉపసంహరణల వరకు పార్టీ బి-ఫాంలు అందించేందుకు నిర్దేశించారు. నామపత్రాలను అధికారులు నేడు పరిశీలించనున్నారు. ఇదే క్రమంలో 14వ తేదీని ఉపసంహరణ గడువుగా నిర్దేశించారు. 14న పార్టీ బి-ఫాంలు ఇచ్చినా సరేనంటూ తాజాగా ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో తెరాస ఆ తేదీ వచ్చే వరకు వేచి చూసే ధోరణి అవలంభించనుంది. ఆఖరు నిమిషంలో తెరాస బి-ఫాంలు ఇస్తే ప్రతిపక్ష పార్టీల వద్దకు తెరాస నిరాశవాదులు వెళ్లకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెరాస భావిస్తోంది. తొలుత అభ్యర్థులను ప్రకటించి బి-ఫాంలు ఇచ్చేస్తే అసంతృప్తులను విపక్ష పార్టీలు చేర్చుకొని టికెట్లు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితి రాకుండా 14నే బి-ఫాంలు ఇవ్వాలని తెరాసలోని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.