వైభవంగా వసంత పంచమి వేడుకలు

 బాసరలో 5 వేల మందికి పైగా చిన్నారులకు అక్షరాభ్యాసాలు


బాసర,  (ఆరోగ్యజ్యోతి)   నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయం జనసంద్రమైంది. అమ్మవారి జన్మతిథి శుభ ఘడియల్లో చిన్నారుల అక్షరాభ్యాసాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గురువారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. గత అనుభవాల నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలతో ఈ సారి భక్తులకు పూజలు, దర్శనాలు సులభతరమయ్యాయి. అక్షరాభ్యాస పూజలకు రెండు, మూడు గంటల సమయం పట్టింది. ఈసారి వసంత పంచమి ఘడియలు రెండురోజుల పాటు ఉండటంతో భక్తులు బుధ, గురువారాల్లో ఆలయానికి తరలివచ్చారు. మొదటి రోజున 1,568 మంది, రెండో రోజున 3,731 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. గురువారం ఒక్క రోజే 50 వేల మంది భక్తులు బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి ఈ ఒక్కరోజే రూ.35.72 లక్షల ఆదాయం సమకూరింది.