రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి

కరీంనగర్‌ హెల్త్‌: (ఆరోగ్యజ్యోతి) ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కే శశాంక వైద్యులను ఆదేశించారు. బుధవారం స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రోగుల చికిత్సకు సంబంధించి పలు విషయాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌, లేబర్‌ రూం, ఐసీయూ, డీఈఐపీ, న్యూట్రిషన్‌, రిహాబిలిటేషన్‌ సెంటర్‌, పేయింగ్‌ రూమ్స్‌ తదితర వార్డులను పరిశీలించారు. రిపోర్టు విషయంలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చూడాలన్నారు. హాస్పిటల్‌లో కార్పొరేట్‌ స్థాయిలో వసతులున్నాయనీ, అందుకు తగ్గట్టుగానే వైద్య సేవలందించాలని చెప్పారు. ప్రసవాల సంఖ్య పెంచడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే దవాఖానకు సంబంధించి ప్రసవాలు, చికిత్స కోసం వచ్చే రోగులు, వైద్యులు, నర్సులు, సిబ్బంది హాజరు, కేసీఆర్‌ కిట్‌ తదితర వివరాలు రోజువారీగా తమకు పంపించాలని సూపరింటెండెంట్‌కు  చెప్పారు. 


 


అలాగే వైద్యశాలలో ఎలాంటి పరికరాలు, సిబ్బంది అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు ప్రతి నెలా అందేలా చర్యలు తీసుకోవాలనీ, అలాగే వారికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలను కల్పించాలని సంబంధిత యజమానులను ఆదేశించారు. రోగులకు వసతుల విషయంలో రాజీపడకూడదనీ, అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. 3వ అంతస్థు నిర్మాణం త్వరగా పూర్తి కావాలనీ, నాణ్యతతో పనులు చేయించాలని సంబంధిత ఇంజినీర్‌కు ఈ సందర్భంగా సూచించారు. నిర్మాణ ప్లాన్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి జీ సుజాత, దవాఖాన సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, ఆర్‌ఎంఓ శౌరయ్య, ఎంసీహెచ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ మంజుల, పీవో డాక్టర్‌ శిరీష, ఏవో అలీం, డీపీఓ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.