వాసవీ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు తిరివేది వేణుగోపాల్
అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
ప్రమాణ స్వీకారం చేస్తున్న వాసవి, వనితా క్లబ్ ప్రతినిధులు
మహబూబ్‌నగర్ సాంస్కృతికం, (ఆరోగ్యజ్యోతి) : పేదలకు సేవ చేయాలన్న గుణం కలిగి ఉండటం గొప్ప లక్షణమని వాసవీ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు తిరివేది వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ వాసవి, వనితా క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గురువారం రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వేణుగోపాల్ మాట్లాడుతూ వాసవీమాత పేరిట సేవ అందించటం గొప్ప పుణ్యకార్యంగా అభివర్ణించారు. సమాజ సేవలో ఆర్యవైశ్యులు ముందున్నారని, ఏటా వాసవి, వనితా క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. 2020 ఏడాదిలో మరిన్ని ప్రజాపయోగ కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవాలని నూతన కమిటీ బాధ్యులకు విజ్ఞప్తి చేశారు. వాసవీ క్లబ్ గవర్నర్ కలకొండ రాఘవేందర్‌గుప్తా మాట్లాడుతూ సంపాదనలో కొంత సమాజ సేవకు ఉపయోగించాలని కోరారు. అనంతరం వాసవీ క్లబ్ అధ్యక్షుడిగా కొక్కళ్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మేడిశెట్టి రమేశ్, కోశాధికారిగా కలకొండ శ్రీనివాస్, వనితా క్లబ్ అధ్యక్షురాలిగా ఎస్.వీణ, ప్రధాన కార్యదర్శిగా పి.హేమలత, కోశాధికారిగా మనీషాలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. వాసవీమాత సాక్షిగా పేదలకు ఉపయోగపడే సేవలతో ముందుకెళతామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్ సీనియర్ ప్రతినిధులు శివకుమార్, కొట్ర శ్రీనివాస్, కొట్ర బాలాజీ, రవికుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.