మహారాష్ట్ర: నిర్మాణంలో ఉన్న ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ ట్రక్కు సహా నాలుగు వాహనాలు బ్రిడ్జి కింద చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ బ్రిడ్జిని ముంబయిలోని ఘాట్కోపర్- మాన్‌కుర్ద్ లింక్ రోడ్డుపై నిర్మిస్తున్నారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. కూలిపోయిన బ్రిడ్జి భాగాన్ని రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే బ్రిడ్జి కూలినట్లు పోలీసులు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.