బీజింగ్: సంక్లిష్టమైన పేగు క్యాన్సర్ నిర్ధారణను సులభతరం చేసే సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రాథమిక దశల్లోనే వ్యాధిని గుర్తించడం ద్వారా మృత్యు ముప్పును తగ్గించేందుకు ఇది దోహదపడనుంది. పేగు క్యాన్సర్ నిర్ధారణకు ప్రస్తుతం నిపుణులు ఎక్కువగా ‘కొలనోస్కోపీ’పై ఆధారపడుతున్నారు. అయితే- అది అసౌకర్యంగా ఉంటుందని, ఈ విధానంలో వ్యక్తుల శరీరంలోకి వైద్య పరికరాలను చొప్పించాల్సి వస్తుందని చైనాలోని హువాఝాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు తెలిపారు. దీంతో చాలామంది పరీక్ష చేయించుకునేందుకు ఆసక్తి చూపరని పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా పేగు క్యాన్సర్‌ను తొలి దశల్లోనే గుర్తించడంతోపాటు దాని తీవ్రతనూ తెలియజేసే ఏఐ సాంకేతికతను తాము అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పేగు క్యాన్సర్ కణితుల్లో ఎక్కువగా కనిపించే 9 రకాల మిథైలేషన్ సూచికలను గుర్తించడం ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. ఈ విధానంలో శరీరంలోకి వైద్య పరికరాలను చొప్పించాల్సిన అవసరం ఉండబోదని వివరించారు.