బడి పిల్లలకు స్వైన్‌ఫ్లూపై అవగాహన


హైదరాబాద్‌: స్వైన్‌ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా బడి పిల్లల్లోనూ విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ గురువారం నిర్ణయించింది. పాఠశాలలో ప్రతిజ్ఞ సమయంలో వైద్యాధికారులు స్వైన్‌ఫ్లూ నివారణ చర్యలపై పిల్లల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినప్పుడు సాధ్యమైనంత వరకు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కు, నోటికి ఏదో ఒకటి అడ్డుగా పెట్టుకోవాలని, అనంతరం చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి వాడుతున్న చేతి రుమాలు, తువ్వాలును మరొకరు వాడకూడదని.. ఇలా పలు జాగ్రత్తలు, చేయకూడని పనులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ బాధ్యతను జిల్లాల్లో వైద్యాధికారులు తీసుకొని క్షేత్రస్థాయిలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.