జనగామ టౌన్, (ఆరోగ్యజ్యోతి) : చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ పుస్తుతం భారత్‌కు వ్యాపించలేదని, ప్రజలు భయాందోళన చెందొద్దని జిల్లా వైద్యాధికారి మహేందర్ సూచించారు. మంగళవారం ఆయన ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడుతూ.. కరోనా వైరస్ అనేది ఒక స్వైన్‌ఫ్లూ వ్యాధి మాదిరిగానే ఉంటుందన్నారు. ఈ వ్యాది భారత్‌కు వ్యాపించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ వైరస్‌పై ప్రజలు భయాందోళన చెందొద్దని, ఎవరికైనా అనుమానాలు, అపోహలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి వైద్యుల సూచనల ప్రకారం రక్త, మూత్ర పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. ఇందుకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా జనగామ, వరంగల్ ఎంజీఎంలో వైద్యులు, వైద్యసిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ వైరస్‌పై వాట్సప్‌లో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించడం ఎంతో మంచిదన్నారు. అంటు వ్యాధులుంటే ఒకరి నుంచి మరొకరికి ప్రబలకుండా ఉంటాయన్నారు. చిన్నపిల్లలు, పెద్దలు తరచుగా చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాలని, తమ ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా తయారు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుగా ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని వివరించారు.