కోల్‌కతా : కరోనా వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు చైనాలో 106 మంది మృతి చెందారు. కరోనా వైరస్ సోకిన బాధితులు న్యూమోనియా వ్యాధితో మరణిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలతో బాధపడుతూ థాయిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి నిన్న మృతి చెందాడు. థాయిలాండ్ జాతీయుడు.. గతేడాది నవంబర్ నుంచి కోల్‌కతాలో నివసిస్తున్నాడు. శ్వాస సంబంధిత సమస్యలతో జనవరి 21న కోల్‌కతాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి కడుపునొప్పి, జ్వరం, వాంతులు రావడంతో ఐసీయూకు తరలించారు. చికిత్స పొందుతూ థాయిలాండ్ జాతీయుడు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతను కరోనా వైరస్ వ్యాధి లక్షణాలను కలిగి ఉన్నాడని వైద్యులు చెప్పారు.
అయితే ఆ వైరస్ సుమారు 4515 మందికి సోకినట్లు తాజాగా అధికారులు నిర్ధారించారు. ఒక టిబెట్ మినహా.. మిగితా చైనా ప్రానిన్సుల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేషియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేంద్ర బిందువైన హుబెన్ ప్రావిన్సులో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. దేశవ్యాప్తంగా స్కూళ్లకు స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవులు ప్రభుత్వం పొడగించింది.