ముంబయి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా శివసేన ప్రభుత్వం.. శివ భోజనం అనే పథకాన్ని ప్రారంభించింది. నిరుపేదలకు రూ. 10కే భోజనం అందించాలనేది ఈ పథకం ఉద్దేశం. అయితే శివ భోజనం పథకాన్ని మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోనే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. పుణెలోని శివ భోజనం కేంద్రం వద్ద జనాలు ఎగబడి పోతున్నారు. సుమారు 500ల మంది వచ్చి క్యూలో నిల్చుంటున్నారు. వీరిని నిలువరించేందుకు కేంద్రం నిర్వాహకులకు సాధ్యమవుతలేదు. దీంతో పోలీసులను పిలిపించి.. ప్రతి ఒక్కరూ క్యూలో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య శివ భోజనం అందుబాటులో ఉంటుంది. రెండు చపాతీలు, ఒక కప్పు అన్నం, ఒక కూరగాయ, ఒక కప్పు పప్పును సరఫరా చేస్తున్నారు. నాణ్యతతో కూడిన భోజనం వడ్డిస్తుండడంతో ఆ కేంద్రాల వద్దకు జనాలు భారీగా చేరుకుంటున్నారు.