మళ్లీ మెరిసెను భాగ్యనగరం

ప్రపంచంలోని మేటి నగరాల్లో హైదరాబాద్‌కు తొలి స్థానం
రెండోసారి అరుదైన గౌరవం
స్థిరాస్తి దిగ్గజ సంస్థ జేఎల్‌ఎల్‌ సిటీ సూచికలో వెల్లడి
గర్వంగా ఉందన్న కేటీఆర్‌


(ఆరోగ్యజ్యోతి) హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరానికి 2018 తర్వాత మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి ప్రపంచంలోని 20 అగ్రశ్రేణి (టాప్‌-20) నగరాల్లో ప్రథమ స్థానం సాధించింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాలను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పేరొందిన జేఎల్‌ఎల్‌(జోన్స్‌ ల్యాంగ్‌ లాసలె) సంస్థ అధ్యయనం చేసింది. వృద్ధి సూచికల ఆధారంగా అత్యుత్తమ నగరాల జాబితాను ఈ సంస్థ ఏడేళ్లుగా ప్రకటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌-20 నగరాల్లో హైదరాబాద్‌ రెండోసారి అగ్రస్థానం సంపాదించింది. దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా దక్షిణాది నగరాలు అత్యుత్తమ పనితీరుతో ముందుకెళ్తున్నాయని తెలిపింది. వేగంగా పట్టణీకరణ, పర్యావరణ ఇబ్బందులు, అధిక రద్దీ, సామాజిక అసమానతలు, సొంతిళ్ల కొరత, భద్రత, అందరికీ అందుబాటులో సేవలు పెద్ద సవాళ్లుగా మారాయని అభిప్రాయపడింది. ‘‘హైదరాబాద్‌ నగరంలో కార్యాలయాల స్థలం అందరికీ అందుబాటులో ఉంది. అమెజాన్‌ సంస్థ అతిపెద్ద క్యాంపస్‌ నిర్మించింది. దిగ్గజ కంపెనీలైన యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరాయి. ఏడాదిగా అన్ని రంగాల్లోనూ నగరంవృద్ధి కనబరిచింది. హైదరాబాద్‌లో కార్యాలయస్థలానికి ఎక్కువ ఆదరణ ఉంది. ఏడాదిలో 20 శాతం వృద్ధి సాధించింది.’’అని జేఎల్‌ఎల్‌ తన నివేదికలో పేర్కొంది.


 భారత్‌ నుంచి ఏడు నగరాలు జాబితాలో స్థానం సంపాదించాయి: హైదరాబాద్‌ (1), బెంగళూరు (2), చెన్నై(5), దిల్లీ(6), పుణె(12), కోల్‌కతా (16), ముంబయి (20)
చైనా నుంచి ఐదు నగరాలు జాబితాలో చేరాయి. సూచిక ప్రారంభించినప్పటి నుంచి తమ అధ్యయనంలో చైనా పనితీరు తగ్గుతోందని నివేదిక పేర్కొంది. తాజాగా షెన్‌జెన్‌(10), చోంగ్వింగ్‌(11), వుహాన్‌(13), హాంగ్‌ఝౌ(15), షాంఘై (17) ఉన్నాయి. వీటి స్థానాలు దిగజారుతున్నాయి.
అమెరికా నుంచి సిలికాన్‌వ్యాలీ (9), ఆస్టిన్‌ (19).. మధ్య ఆసియా, ఆఫ్రికాల నుంచి నైరోబీ(4), దుబాయి(14), రియాద్‌(18), ఆగ్నేయాసియా నుంచి హోచీమిన్‌(3), హానోయి(7), మనీలా(8) నగరాలు జాబితాలో చోటు సాధించాయి.


మూడేళ్లలో రెండుసార్లు అగ్రస్థానం: కేటీఆర్‌
పురోగమిస్తున్న(డైనమిక్‌) నగరాల సూచీలో ప్రపంచంలోని 130 నగరాలతో పోటీపడుతూ వరసగా మూడేళ్లలో రెండుసార్లు హైదరాబాద్‌ అగ్ర స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ జేఎల్‌ఎల్‌ సంస్థ రూపొందించిన ‘సిటీ మూమెంటమ్‌ ఇండెక్స్‌ 2020’ నివేదికను శనివారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో పురోగమిస్తున్న మొదటి 20 నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు దక్కని దశ నుంచి ఏటేటా క్రమంగా, స్థిరంగా మెరుగవుతూ ఆరేళ్లలో అగ్రస్థానం చేరిన తీరు తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ఇదే సమాధానమన్నారు. 2015లో తొలిసారి 20వ స్థానం, 2016లో ఐదో స్థానం, 2017లో మూడో స్థానం, 2018లో మొదటి స్థానం, 2019లో రెండో స్థానం, 2020లో తిరిగి మొదటి స్థానం హైదరాబాద్‌కు దక్కిందన్నారు.