అద్దెకు బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్లు



‘న్యూ బిజినెస్‌’ పేరుతో ఆదాయంపై దృష్టి
ఉద్యోగుల స్వచ్ఛంద విరమణతో ఖాళీ అవుతున్న కార్యాలయాలు



హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. న్యూ బిజినెస్‌ పేరుతో తమ సంస్థకు చెందిన నివాస సముదాయాల (క్వార్టర్స్‌)ను అద్దెకిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సంస్థకు వేర్వేరు ప్రాంతాల్లో నివాస సముదాయాలున్నాయి. వీటిలో మూడో వంతు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.పెద్ద ఎత్తున ఈ నెలాఖరుతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయనుండటంతో మున్ముందు ఈ ఖాళీల సంఖ్య సగానికి చేరుకోనుంది. నెలలుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న క్వార్టర్స్‌తో ఆదాయం కోల్పోతుండగా.. భవనాలు పాతవైపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థకు చెందిన క్వార్టర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు అద్దెకివ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే అద్దెల రూపంలో సంస్థకు నెలకు రూ.55 లక్షల ఆదాయం సమకూరుతోంది. సంస్థకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, సరూర్‌నగర్‌, వనస్థలిపురం, సికింద్రాబాద్‌, సైనిక్‌పురితో పాటు మరిన్ని ప్రాంతాల్లో నివాస సముదాయాలున్నాయి. వీటిలో 1,392 ఇళ్లుండగా 400 వరకు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 600 చ.అ. మొదలు.. 2000 చ.అ.వరకు ఐదు శ్రేణుల్లో నివాస సముదాయాలున్నాయి. ప్రాంతాలను బట్టి నెలకు రూ.6 వేల నుంచి 25 వేల వరకు అద్దెలున్నాయి. బంజారాహిల్స్‌, సైనిక్‌పురిలో ఇప్పటికే అద్దెకిచ్చారు. ఇంకా చాలా ఖాళీలున్నాయని అధికారులు చెబుతున్నారు.


మూడోవంతు ఖాళీ..
హైదరాబాద్‌ పరిధిలో ప్రస్తుతం 3,700 మంది ఉద్యోగులుండగా..50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు కేంద్రం వీఆర్‌ఎస్‌ అవకాశం ఇవ్వడంతో ఈ నెలాఖరుతో 2,600 మంది విధుల నుంచి తప్పుకొంటున్నారు. తెలంగాణ సర్కిల్‌ పరిధిలో మొత్తం ఉద్యోగులు 8,081 మంది ఉండగా స్వచ్ఛంద పదవీ విరమణ అర్హత ఉన్నవారు 5,096 మంది. వీరిలో 4,880 మంది వీఆర్‌ఎస్‌ తీసుకున్నవారు ఉన్నారు.


కార్యాలయాలు సైతం..
రాజధానిలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ముఖ్యమైన ప్రదేశాల్లో కార్యాలయాలు, టెలిఫోన్‌ ఎక్స్ఛేంజిలున్నాయి. వీటిలోనూ చాలా వరకు ఖాళీలున్నాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లో 8, 9వ అంతస్తులను ఇప్పటికే జీఎస్‌టీకి అద్దెకిచ్చారు. ఈ నెలాఖరుకు పెద్ద ఎత్తున స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేస్తుండటంతో మరో మూడు, నాలుగు అంతస్తులు ఖాళీ అయ్యే అవకాశముంది. మిగిలిన ఉద్యోగులను ఇదే భవనంలోని మూడు అంతస్తుల్లో సర్దడం లేదా.. అందరినీ లక్డీకాపూల్‌లోని టెలిఫోన్‌భవన్‌, నాంపల్లిలోని దూరసంచార్‌ భవన్‌కు తరలించే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. ఇక్కడి నుంచి మిగిలిన ఉద్యోగులను తరలిస్తే భవనం మొత్తం అద్దెకిచ్చే యోచనలో ఉన్నారు. లక్ష చదరపు అడుగులకు పైగానే ఇక్కడ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉంది. ఇక్కడ చదరపు అడుగు రూ.84 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. అమీర్‌పేట, గచ్చిబౌలి, మాదాపూర్‌, సరూర్‌నగర్‌, లింగంపల్లి, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, నాచారం, గౌలిగూడ, తిరుమలగిరిలో 1,600 చదరపు అడుగుల నుంచి 35వేల చ.అ. వరకు ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉంది. చర్లపల్లిలో గోడౌన్‌కు అనుకూలమైన స్థలం ఉంది. ఇప్పటికే వీటిపై ఆసక్తి ఉన్నవారి నుంచి టెండర్లు పిలిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు, రూ.25 కోట్ల టర్నోవర్‌ కలిగిన సంస్థలకు వీటిని అద్దెకు లేదా లీజుకు ఇవ్వనున్నారు. టెలికాం సంస్థలకు మాత్రం ఇవ్వరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 346 ఎక్స్ఛేంజి భవనాల్లో ఉన్న స్థలాలను అద్దెకు ఇస్తున్నారు.