అనంతపురం: ఓ కేసు విషయమై బెయిల్ పత్రాలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని..పత్రాల పరిశీలన పేరుతో పోలీసులు 8 గంటలపాటు ఠాణాలోనే కూర్చోబెట్టారు. మరోవైపు జేసీకి మద్దతుగా తెదేపా నేతలు, శ్రేణులు స్టేషన్ బయట ఆందోళన చేపట్టడంతో వారిని వేరే ఠాణాకు తరలించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసు అధికారుల సంఘం సభ్యులు అనంత గ్రామీణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జేసీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. ఆ బెయిల్ పత్రాలతో శనివారం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. ఉదయం 10:45 గంటలకు స్టేషన్‌కు చేరుకున్న జేసీని పత్రాల పరిశీలన పేరుతో రాత్రి 7:30 గంటలకు విడిచిపెట్టారు. ఠాణా నుంచి బయటకు వచ్చాక జేసీ మాట్లాడుతూ.. బెయిల్ పరిశీలన విషయంలో పోలీసులు కావాలనే జాప్యం చేసి తనను భయభ్రాంతులకు గురిచేయాలని చూశారన్నారు.