రాయితీ తినేశారు.. ప్లాంట్లు మూసేశారు

బయోగ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణాల్లో నిధుల దుర్వినియోగం


ఉమ్మడి జిల్లాలో 1,541 యూనిట్లకు రూ.1.48 కోట్ల రాయితీ


బయోగ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణాల పేరుతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. అసలు ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టకుండానే కొన్ని ఏజెన్సీలు రాయితీ సొమ్మును నొక్కేశాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరణీయ ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ (ెరెడ్కో) ద్వారా ఈ పథకాన్ని అమలు చేసింది. రైతులకు వ్యక్తిగతంగా బయోగ్యాస్‌ ప్లాంట్లను మంజూరు చేయడంతోపాటు ఎంఎన్‌ఆర్‌ఈ (మినిస్ట్రీ ఆఫ్‌ నాన్‌ కన్వెన్షన్‌ ఎనర్జీ సోర్సు) పథకం ద్వారా వాణిజ్య అవసరాల కోసం బయోగ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణాలకు కూడా ఉదారంగా నిధులు మంజూరు చేశారు. ప్లాంట్ల నిర్మాణాల్లోనూ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు సమాచారం. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్‌ సమీపంలో టెలీ కమ్యూనికేషన్‌ టవర్లకు ఇంధనం సరఫరా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా బయో పవర్‌ప్లాంటును ఏర్పాటు చేశారు. 2012 అక్టోబరు 11న స్కాట్‌లాండ్‌కు చెందిన రాయల్‌ బ్యాంక్‌ కార్యనిర్వాహక అధికారి మీరా హెచ్‌.సాన్యాల్‌ దీన్ని ప్రారంభించారు. 85 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఈ ప్లాంటును నిర్మించింది. అప్పట్లో ఈ ప్లాంటు నిర్మాణాన్ని గొప్పగా చెప్పుకొన్నా పనిచేసింది నెల రోజులు మాత్రమే. ఈ ప్లాంటుకు మంజూరైన రాయితీని, నిర్వహణ ఖర్చులను సైతం ఆ సంస్థే కాజేసినట్లు సమాచారం. ఇలా ఉమ్మడి జిల్లాలో 10 ప్లాంట్లను ఇదే స్వచ్ఛందసంస్థ నిర్మించి రాయితీ సొమ్మును స్వాహా చేసినట్లు తెలుస్తోంది. రైతుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన బయోగ్యాస్‌ ప్లాంట్లకు సంబంధించిన నిధులు కూడా భారీగా దుర్వినియోగం అయ్యాయి. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత అయిదేళ్లలో 1,541 బయోగ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటికి కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ.1,48,41,000 రాయితీని అప్పటి అధికారుల ప్రమేయంతో సంబంధిత ఏజన్సీల ఖాతాల్లో మళ్లించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఆ నిర్మాణాల ఆనవాళ్లు కూడా కొన్నిచోట్ల కనిపించడం లేదు.