‘పీకే’సిన జేడీ(యూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌పై వేటు

దిల్లీ, కోల్‌కతా: ఎన్నికల వ్యూహకర్త, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)ను జేడీ(యూ) బహిష్కరించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్‌ వర్మపైనా వేటు వేసింది. కొంతకాలంగా వీరిద్దరూ పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జేడీ(యూ) ముఖ్య ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి బుధవారం తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)లను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నీతీశ్‌ మద్దతివ్వడాన్ని వీరిద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు.


తృణమూల్‌ గూటికి?
తాజా పరిణామాల నేపథ్యంలో పీకే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటికే ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.  సీఏఏ విషయంలో మమత కూడా కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. ‘‘పీకే వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తాం’’ అని తృణమూల్‌ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు.