కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి
దుండిగల్, (ఆరోగ్యజ్యోతి) : అధికార తెరాస ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారడంతో రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. 2024లో తెలంగాణలో భాజపా జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పురపాలిక ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో ఆయన శనివారం విస్తృతంగా పర్యటించారు. బౌరంపేటలో కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇచ్చేందుకు కేంద్రం రూ.28 రాయితీ భరిస్తోందన్నారు. తెలంగాణలో పేదలకు ఇళ్లు కట్టించేందుకు కేంద్రం ముందుకొచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కటీ నిర్మించలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని.. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.30వేల కోట్లు అందజేసిందన్నారు. రాష్ట్రంలో సచివాలయం లేకుండా పరిపాలన చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. బౌరంపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్న హామీని తెరాస అమలు చేయలేదన్నారు. స్థానిక సర్వే నం.166లోని అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కొని రైతులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.