రాష్ట్రమంతటా ఒకేలా ఫలితాలు
ఇంతటి హవాను ఎన్నడూ చూడలేదు
ఆరేళ్ల పాలన నచ్చే మాకు బ్రహ్మరథం పట్టారు
ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు
కేటీఆర్‌కు ఆశీస్సులు, పార్టీ శ్రేణులకు అభినందనలు
మార్చి 1 నుంచి 57 ఏళ్లు దాటిన వారికి పింఛను
ఉద్యోగులకు త్వరలో వేతన సవరణ, వయోపరిమితి పెంపు
ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు పురపాలక, నగరపాలక ఎన్నికల్లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకేలా... 360 డిగ్రీల ఫలితాలు వచ్చాయన్నారు. ‘‘తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఈ విజయం సాధ్యమైంది. అందరిని కలుపుకుపోతున్నాం. ఇది ప్రజలకు నచ్చింది. వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి నా ధన్యవాదాలు. విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు. కేటీ రామారావుకు నా ఆశీస్సులు. అందరూ కలిసి చక్కటి ఫలితాలు సాధించారు.ఆరేళ్ల తెరాస ప్రభుత్వ పనితీరు నచ్చే కారుకు బ్రహ్మరథం పట్టారు’’ అని సీఎం తెలిపారు. పురపాలక ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నిరుద్యోగ భృతి అమలుపైనా ఆలోచనలు
త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచుతామని, పీఆర్‌సీపై ఉద్యోగులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఆర్థికపరిస్థితులను వారికి వివరిస్తామన్నారు. ఐకేపీ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 57 ఏళ్లు దాటిన వాళ్లకు మార్చి 1 నుంచి వృద్ధాప్య పింఛన్లు అందజేస్తామన్నారు. ఈ బడ్జెట్లోనే నిధులు కూడా కేటాయిస్తామన్నారు. నిరుద్యోగ భృతి అమలుపైనా ఆలోచనలు చేస్తున్నామన్నారు.
సీఎం ముక్కు కోస్తానంటమేంటి?
‘‘మేం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలకు వెళ్లగా వాటిని ఆపాలని విశ్వప్రయత్నం చేశారు. రకరకాలుగా ఇబ్బందిపెట్టారు. ప్రజలంతా ముక్తకంఠంతో తీర్పు ఇచ్చారు. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోలేదు. ఒకరైతే ముఖ్యమంత్రి ముక్కు కోస్తానని అంటారు. సీఎం అనే కనీస మర్యాద లేకుండా ముక్కు కోస్తా అంటూ వ్యాఖ్యానించడం ఏంటి? ఇదేనా జాతీయ పార్టీల పద్ధతి? ఇదేనా ఆ పార్టీ సంస్కారం.
సోషల్ మీడియానా? యాంటీనా?
ప్రతిపక్షాలు గెలిస్తే ఒక న్యాయం.. మేం గెలిస్తే ఒక న్యాయమా? సోషల్ మీడియానా? యాంటీ సోషల్ మీడియానా? అర్థం కావడం లేదు. వ్యక్తిగత దూషణలు బంద్ చేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. తెరాస మొదటి నుంచి క్రమశిక్షణతో పెరిగింది. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోవద్దని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారు.
అమ్ముడుపోయారని చెప్పదలచుకున్నారా?
భాజపా నాయకుడు తెరాస అధికార దుర్వినియోగం అంటూ ఆరోపణలు చేశారు. మంత్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారు. రూ.వేల కోట్లకు ప్రజలు అమ్ముడుపోయారని చెప్పదలుచుకున్నారా? మీరు గెలిస్తే న్యాయంగా గెలిచినట్లా? ఈ ఎన్నికల్లో నేను ఏ ఒక్కరితోనూ మాట్లాడలేదు. ప్రచారానికే వెళ్లలేదు. కేటీఆర్ కూడా సిరిసిల్లకు వెళ్లి వచ్చారు. జిల్లాల్లో మంత్రులే ప్రచారం చేశారు. కేటీఆర్ సహా ఇతర నేతలంతా 24 గంటలు కష్టపడ్డారు. కాబట్టే ఇలాంటి ఫలితం వచ్చింది. చౌకబారు మాటలతో ప్రజల తీర్పును అగౌరవపరచొద్దు. విపక్షాలు కూడా కొన్ని స్థానాలు గెలిచాయి. మరి వాళ్లు ఎలా గెలిచారు? ఈ ఎన్నికల్లో తెరాస ఎన్నికల సామగ్రిని కొని జిల్లాలకు పంపించేందుకు రూ.80 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టింది.
కొత్త రెవెన్యూ చట్టం
త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం. రెవెన్యూ ఉద్యోగులతో మాట్లాడుతాం. ఎమ్మార్వో కార్యాలయాలకు పెట్రోల్ డబ్బాలు తీసుకురావడం ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో రెవెన్యూ ఉద్యోగులు ఆలోచించాలి. ఎంత బాధ ఉంటే ప్రజలు అలా చేస్తారో వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంతులేని పైసలు ఏం చేసుకుంటారు? ఇకపై అవినీతిని ఉపేక్షించేది లేదు. ఎవరు ఏమనుకున్నా భయపడేది లేదు. ప్రజలే మా బాస్‌లు. ప్రభుత్వాల్నే ప్రజలు తీసి పారేస్తున్నారు. అలాంటిది రెవెన్యూ శాఖ ఒక లెక్కా? యూనియన్లు ఉద్యోగులకు మంచి చేయాలి. అడ్డంగా వ్యతిరేకిస్తామని చెప్పడం సరికాదు. కొత్త రెవెన్యూ, పంచాయతీ చట్టాన్ని కఠినంగా అమలు చేసి తీరుతాం.
కంటి వెలుగుకు ప్రశంసలు
రాష్ట్రంలో పౌరుల ఆరోగ్య సూచికల నమోదు కార్యక్రమాన్ని త్వరలో చేపడతాం. కంటివెలుగుకు గొప్ప ఆదరణ లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పరీక్షల కార్యక్రమమని ఎల్వీప్రసాద్ వైద్యులు తెలిపారు. తాజా కార్యక్రమం మరింత విస్తృతంగా ఉంటుంది. రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలనకు బృహత్తర కార్యక్రమం చేపడతాం. కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యం వల్లనే రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యతకు నోచుకోలేదు. ఇప్పుడు ఒకరు మరొకరికి బోధించాలి అనే నినాదంతో దీన్ని చేపడుతున్నాం.
పన్నులు పెంచుతాం
పుర, నగరపాలికల్లో, గ్రామ పంచాయతీల్లో దశాబ్దాలుగా పన్నులు పెంచలేదు. చెల్లింపు సామర్థ్యం గల వారిపై పన్ను భారం తప్పదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని వర్తింపజేస్తాం. రైతు సమన్వయ సమితులను క్రియాశీలం చేస్తాం. రైతులే నిర్ణయాధికారులుగా మారే ప్రక్రియను తెస్తాం.
గల్ఫ్ యాత్ర
త్వరలోనే గల్ఫ్ యాత్రకు వెళ్తాం. చాలామంది అప్పులు చేసి అక్కడకు ఎందుకెళ్తున్నారో తెలీదు. ఇక్కడ పుష్కలంగా ఉపాధి వనరులున్నాయి. గృహ నిర్మాణ పనుల్లో బిహార్, ఇతర రాష్ట్రాల వారు పనిచేస్తున్నారు. ఇటీవల మా ఇంటి నిర్మాణ పనుల్లో అంతా వారే కనిపించారు. ఒక్కరూ తెలంగాణ వారు లేరు. మంత్రులు, ఎమ్మెల్యేలతో గల్ఫ్‌కి వెళ్లి వారితో మాట్లాడతా. రాయబార కార్యాలయాన్ని సంప్రదించి వారి సమస్యలు పరిష్కరిస్తాం. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక విధానం తెస్తాం వచ్చే శాసనసభ సమావేశాలకు ముందుగానీ తర్వాత గాని వెళతాం. న్యాక్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని రోడ్లు,భవనాల శాఖ మంత్రికి చెప్పాను. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ వాటిని ప్రారంభిస్తాం.
కేంద్రానివి మాటల మూటలు..
కేంద్రం మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటట్లేదు. గత ఐదేళ్లు తెలంగాణ భారత్‌లో అగ్ర స్థానంలో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానాల పుణ్యమాని ఈ ఏడాది రాష్ట్రం అభివృద్ధి రేటు 9.5 శాతానికి తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ పెండింగులో ఉన్నాయి. ప్రస్తుతం భారత జీడీపీ మూడు, నాలుగు కాదు సున్నాగా ఉందని కొందరు అంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా దిగజారుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు’’ అని కేసీఆర్ అన్నారు.
త్వరలోనే పట్టణ ప్రగతి
పల్లె ప్రగతి కార్యక్రమం మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తాం. పల్లెలకు ఇచ్చిన మాదిరే పట్టణాలకు నెలనెలా నిధులు ఇస్తాం. కొత్తగా ఎన్నికైన వారికి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. పట్టణాల అభివృద్ధి, నగరీకరణలో సవాళ్లపై అవగాహన కల్పిస్తాం. అనేక నగరాలు పట్టణాలు కాలుష్యంతో ఉన్నాయి. నగరానికి పరిశ్రమలు వస్తుంటే సంతోషంతో పాటు భయం కూడా కలుగుతోంది. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు కల్పించడం మా ముందున్న ప్రధాన సవాలు. వీటన్నింటిపై నిరంతర శిక్షణ కోసం 20 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ అర్బన్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో మహిళల ద్వారా పెద్దఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాం. దుమ్ముగూడెం బ్యారేజీని త్వరలో చేపడతాం.