విజయవాడ నుంచి ఇటు విశాఖపట్నం వైపు.. అటు తెలంగాణలోని సికింద్రాబాద్ వైపు రద్దీ ఎక్కువగా ఉంటుంది. గుంటూరు-సికింద్రాబాద్ మధ్య సింగిల్ లైనే ఉంది. దీంతో రైళ్ల వేగం పెంచడం.. కొత్త రైళ్లు వేయడం కష్టంగా ఉంది. నల్లపాడు-బీబీనగర్ (243 కి.మీ.ల) మార్గంలో రెండోలైను ఏర్పాటుకు చేసిన సర్వే ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ నిర్ణయం తీసుకోకుండా పక్కనపెట్టేశారు. ఎంతో లాభదాయకంగా ఉండే ఈ మార్గంలో రెండో లైను మంజూరు చేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభం అవుతాయి.
* గుంటూరు నుంచి గుంతకల్లు మధ్య ఒకే లైను ఉండగా.. రెండో లైను మంజూరై, పనులు జరుగుతున్నాయి. 443 కి.మీ.ల ఈ మార్గానికి రూ.4 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. నిర్మాణం పూర్తయితే రాయలసీమ నుంచి విజయవాడకు రాకపోకలు వేగవంతం అవుతాయి.
* నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నర్సాపురం, కాకినాడ-పిఠాపురం వంటి కీలక ప్రాజెక్టులకూ అధిక నిధులు కేటాయించాలి.
వాల్తేర్ డివిజన్ మాటేమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ ‘వాల్తేర్ డివిజన్’ ఉనికి లేకుండా చేస్తుండటంపై బాగా అసంతృప్తి ఉంది. ఆ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్ వివిధ వర్గాల నుంచి ముక్తకంఠంతో వినిపిస్తోంది.
రైల్వేలు పరుగులు తీయాలంటే..
* విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్ ప్రక్రియను వేగవంతం చేయాలి.
* కొత్తగా వచ్చే జోన్‌లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌ను ఏర్పాటు చేయాలి.
* ఇంతవరకు ఏపీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ లేదు. దీన్ని ప్రకటించాలి.
* విశాఖపట్నం-వారణాసి, విశాఖపట్నం-బెంగళూరు, తిరుపతి-అయోధ్యల మధ్య కొత్తరైళ్లు ప్రకటించాలి.
* నిర్మాణంలో ఉన్న గూడూరు-విజయవాడ మూడోలైనుకు ఈసారి కేంద్ర బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి.
* టెండర్లు పిలిచిన విజయవాడ-దువ్వాడ మూడోలైన్ పనులు సత్వరం మొదలుపెట్టాలి.
* మూడేళ్లుగా మొక్కుబడి నిధులతో సరిపెడుతున్న రాజధాని అమరావతి అనుసంధాన కొత్త రైలు మార్గాలకు అధిక నిధులు కేటాయించి పట్టాలు ఎక్కించాలి.
ఎంపీల వినతులూ బుట్టదాఖలే
బడ్జెట్‌కు ముందు ఏటా దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో సమావేశాలు నిర్వహించి విజ్ఞప్తులు తీసుకుంటున్నా అవి బుట్టదాఖలు అవుతున్నాయి. రైల్వేబోర్డుకు పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నా బడ్జెట్‌లో మాత్రం ప్రాధాన్యం కనిపించడం లేదు. ఈసారైనా వారి వినతులకు మోక్షం లభిస్తుందో.. లేదో.. చూడాలి.
ఎంపీల ప్రధాన డిమాండ్లు
* ఒంగోలు-దొనకొండ మధ్య కొత్త రైలు మార్గం.
* విజయవాడ నుంచి అమరావతికి కొత్త రైలు మార్గం పనులు సత్వరం చేపట్టాలి.
* కడప-బెంగళూరు కొత్త మార్గం పనుల్ని వేగవంతం చేయాలి.
* అనంతపురం నుంచి అమరావతికి కొత్త రైళ్లు
* 20ఏళ్ల క్రితం మంజూరై పక్కనపెట్టిన మాచర్ల-నల్గొండ లైనుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి.
కొత్త లైన్లపై స్పష్టత కరవు!
కొత్త లైన్ల డిమాండ్లపై సర్వే చేయనున్నట్లు రైల్వేశాఖ నాలుగేళ్ల క్రితం ప్రకటించింది. వాటిపై స్పష్టత రాలేదు. ఈ ప్రతిపాదిత మార్గాల్లో కొత్త లైన్లను ప్రకటించాలి.
* డోన్-మహబూబ్‌నగర్
* నర్సాపురం-మచిలీపట్నం
* దర్శి-నర్సరావుపేట
* కంభం-ఒంగోలు
* చిత్తూరు-కుప్పం
* ఓబుళవారిపల్లి-వాయల్పాడు
* తుని-కొత్తవలస (నర్సీపట్నం మీదుగా)
శతాబ్ది రైళ్లు వస్తేనే..
విజయవాడ-హైదరాబాద్, విజయవాడ- విశాఖపట్నం, విశాఖపట్నం-హైదరాబాద్, కర్నూలు-విజయవాడకు శతాబ్ది రైళ్లు అవసరం. అయితే ఆయా రూట్లలో రైళ్ల సగటువేగం తక్కువగా ఉంది. ఉత్తరాదిన ప్రధాన నగరాల మధ్య గణనీయ సంఖ్యలో శతాబ్ది రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ తెలుగు రాష్ట్రాలను విస్మరిస్తోంది. గత రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఈ విషయాన్ని రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లింది. బడ్జెట్‌లో లేదా ఆ తర్వాత అయినా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.
దేశంలో మనమెక్కడ!
పలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 9,167 రూ.కి.మీ.ల రైలు మార్గాలుండగా.. రాజస్థాన్‌లో 5,894, మహారాష్ట్రలో 5,784, గుజరాత్‌లో 5,259, పశ్చిమబెంగాల్‌లో 4,139, తమిళనాడులో 4,028 రూ.కి.మీ.ల మేర లైన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ సంఖ్య 4 వేలు దాటనే లేదు.