ప్రజారోగ్యంపై ప్రభుత్వ చర్యలు భేష్‌ 

ప్రజారోగ్యంపై ప్రభుత్వ చర్యలు భేష్‌ 











వైద్య, ఆరోగ్య రంగాలపై సీఎం జగన్‌ చూపుతున్న శ్రద్ధ దేశానికే ఆదర్శం


తలసేమియా, సికిల్‌సెల్‌ అనీమియా, క్యాన్సర్‌లకు ఉచితంగా చికిత్స అభినందనీయం


పలువురు అంకాలజీ వైద్య నిపుణుల కితాబు


సచివాలయంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌


ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హెమటాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అలోక్‌ శ్రీవాస్తవ్‌  








సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాలపై చూపుతున్న శ్రద్ధ దేశానికే ఆదర్శమని పలువురు వైద్య నిపుణులు కొనియాడారు. అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రాణాంతకమైన క్యాన్సర్, తలసేమియా, సికిల్‌సెల్‌ అనీమియా వంటి వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించడం కోసం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయంలో తలసేమియా, సికిల్‌సెల్‌ అనీమియా, లిక్విడ్‌ క్యాన్సర్‌ నివారణపై జరిగిన వర్క్‌షాప్‌లో బెంగళూరు, చెన్నైలతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు అంకాలజీ వైద్య నిపుణులు హాజరయ్యారు.ముఖ్య అతిథిగా ప్రముఖ హెమటాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అలోక్‌ శ్రీవాస్తవ్‌ హాజరయ్యారు. ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యాధుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి నిపుణుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. పేదవాడి ఆరోగ్యం కోసం, ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమని వైద్య నిపుణులు హామీ ఇచ్చారు. 



ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం: డాక్టర్‌ పీవి రమేష్‌ 
పేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌ తెలిపారు. తలసేమియా, సికిల్‌సెల్‌ వంటి వ్యాధుల బారిన పడినవారికి చికిత్స అందించడమే కాకుండా పెన్షన్‌ ఇవ్వడం ద్వారా వారికి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తోందన్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించి ఎంత ఖర్చు అయినా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలని సీఎం జగన్‌ ఇచ్చిన ఆదేశాలు అనేకమంది పేదలకు కొత్త జీవితాన్ని ఇచ్చాయని తెలిపారు. గ్రామాల్లో వుండే ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ వైద్యులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణాంతక వ్యాధి లక్షణాలు వున్న వారిని గుర్తించి, నోడల్‌ ఆస్పత్రులకు వివరాలను పంపించాలన్నారు. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఈ డేటాబేస్‌ ఆధారంగా వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు.  


ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అన్ని వసతులు: జవహర్‌రెడ్డి 
రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు, జిల్లా కేంద్ర వైద్యశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు, వసతులను ప్రభుత్వం సిద్ధం చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ఖాళీగా వున్న అంకాలజీ వైద్య నిపుణుల నియామకాలను చేపట్టిందని చెప్పారు. ప్రాణాంతక వ్యాధుల లక్షణాలపై మారుమూల గ్రామాల్లో కూడా ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌లో ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శివారెడ్డి, డీఎంఈ డాక్టర్‌ వెంకటేష్, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ అరుణకుమారి, కమిషనర్‌ డాక్టర్‌ యూఆర్కే రావు, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ పి.శ్యాంప్రసాద్, చెన్నై, బెంగుళూరుతోపాటు రాష్ట్రంలోని వైద్య నిపుణులు పాల్గొన్నారు.