ఆర్‌టీఎంఎన్‌యూ స్నాతకోత్సవంలో సీజేఐ జస్టిస్ బోబ్డే
నాగ్‌పుర్: (ఆరోగ్యజ్యోతి) పౌరసత్వమంటే కేవలం హక్కులు మాత్రమే కాదని, సమాజం పట్ల పౌరులకు ఉన్న బాధ్యతల్నీ ఇది పేర్కొంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే చెప్పారు. శనివారం ‘రాష్ట్రసంత్ తుకడోజీ మహారాజ్ నాగ్‌పుర్ విశ్వవిద్యాలయం’ (ఆర్‌టీఎంఎన్‌యూ) 107వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు క్రియాశీల పౌరులుగా బాధ్యత ఉంటుందని, పౌరసత్వమంటే సమాజం పట్ల బాధ్యత అని వివరించారు. ఇతరుల యోగక్షేమాలను విస్మరించలేమన్నారు. ‘‘విద్య పరమార్థం క్రమశిక్షణ. కొన్నిచోట్ల మాత్రం క్రమశిక్షణపై ఆగ్రహం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అసలు క్రమశిక్షణ అంటే ఇప్పుడు అనుకుంటున్న అర్థం కాదు. క్రమశిక్షణ అంటే శిష్యుడిగా ఉంటూ గురువు వద్ద నేర్చుకోవడం. వివేకం, సత్ప్రవర్తనలను మెరుగుపరచడమే విద్య నిజమైన లక్ష్యం. ప్రస్తుత రోజుల్లో విద్య విస్తరిస్తున్నా, దురదృష్టవశాత్తూ కొన్ని విద్యాసంస్థలు మాత్రం అత్యంత వాణిజ్య ధోరణిని కనబరుస్తున్నాయి. న్యాయవిద్యను అందిస్తున్న కొన్ని సంస్థలపై నాకున్న సమాచారం మేరకు ఈ మాట చెబుతున్నాను. విశ్వవిద్యాలయాలు ఉన్నది మూస పద్ధతిలో విద్యార్థుల్ని తయారు చేయడానికి కాదు. ఎప్పటికప్పుడు మారుతుండే సమాజ అవసరాలకు దీటుగా వర్సిటీలు తమను తాము మార్చుకోవాలి’’ అని సీజేఐ అన్నారు. విశ్వవిద్యాలయాలు తల్లివంటివని, తగిన విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించి.. పిల్లల్ని ఇవి జీవితాంతం రక్షిస్తుంటాయని చెప్పారు.