వైద్యసేవలు ఎలా ఉన్నాయ్‌?

ఉస్మానియా ఆసుపత్రిలో హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య ఆరా


 బషీర్‌బాగ్‌, : పేద రోగులకు వైద్యులు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య వైద్యులకు సూచించారు. ఛైర్మన్‌గా నియమితులైన తర్వాత ఆయన తొలిసారిగా శనివారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ వైద్య సేవలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే తక్షణమే కమిషన్‌ను ఆశ్రయించాలని రోగులకు సూచించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాగేందర్‌, ఆర్‌ఎంవోలతో ఆయన సమావేశమయ్యారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాసుపత్రులను సందర్శిస్తానని, రోగుల స్థితిగతులపై నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తానన్నారు.