సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలి

ఆసిఫాబాద్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెలే ఆత్రం సక్కు, జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతులతో కలిసి సోమవారం ప్రారంభించారు. రక్తనిధి కోసం సిద్ధం చేసిన ఆధునిక యంత్రాలను పరిశీలించారు. వాటి ప్రయోజనాలు అడిగితెలుసుకున్నారు. రక్తనిధి కేంద్రం బీద రోగులకు ఉపయోగపడేలా శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో కుమ్రం బాలును కోరారు. ఆసుపత్రిలో కావాల్సిన వైద్యులు, పరికరాలను సమకూర్చేందుకు శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బంది చిత్త శుద్ధితో కృషిచేయాలని కోరారు. ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌, జడ్పీటీసీ సభ్యులు అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు చిలువేరు వెంకన్న, గంధం శ్రీనివాస్‌, తెరాస మండల అధ్యక్షులు గాదివేని మల్లేష్‌ పాల్గొన్నారు.