ఇక మన దగ్గరే రక్తనిధి తీరనున్న తలసీమియా, సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్థుల సమస్య


గర్భిణులు, బాలింతలకు అందుబాటులో రక్తం


నేడు జిల్లా కేంద్రంలో రక్తనిధి కేంద్రం ప్రారంభం


ఆసిఫాబాద్‌ : జిల్లా ఆసుపత్రిగా ఉన్నతీకరించిన ప్రభుత్వ ఆసుపత్రిప్రాణాపాయ స్థితిలో అత్యవసరంగా రక్తం కావాల్సి వస్తే సంబంధీకులు పరుగులుదీస్తారు. సమయానికి కావాల్సిన రక్తం అందక పోతే విలువైన ప్రాణాలు గాల్లో కలిసినట్లే. వైద్య రంగంలో ఇప్పటివరకు కృత్రిమంగా తయారు చేయలేనిది రక్తమొక్కటే. సాటి మనిషి నుంచి సేకరిస్తే తప్ప అది లభించదు. దాతలు ముందుకొచ్చినా దాన్ని నిల్వ చేసే కేంద్రం ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో లేదనే బెంగ ఇప్పుడు అవసరం లేదు. రక్తం కోసం ఇక నుంచి మంచిర్యాల, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తున్న రక్తనిధి కేంద్రం నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభం కానుంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆసిఫాబాద్‌ ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా ఉన్నతీకరించడం, ఈ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభించడం జిల్లాలోని రోగులకు సంతోషకరమైన విషయం.

కుమురం భీం జిల్లాలో రక్తనిధి కేంద్రం లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగజ్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలోని రక్త నిల్వ కేంద్రం కూడా మూసి వేసి సుమారు ఏడాది దాటింది. దీంతో ప్రమాదాల్లో గాయపడి రక్తం అవసరమైన వారు, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు.. ఇలా ఎవరికి రక్తం అవసరమైనా మంచిర్యాల, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ వంటి ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 13 రక్తనిధి కేంద్రాలను మంజూరు చేసింది. అందులో ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరైంది. ఇందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలు సుమారు 8 నెలల కిందటే ఆసుపత్రికి వచ్చాయి.



రక్తం నుంచి ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మాను వేరు చేసే యంత్రాలు


రూ.20 లక్షల విలువైన పరికరాలు


రక్తనిధి ఏర్పాటు కోసం సుమారు రూ.20 లక్షల విలువైన పరికరాలు వచ్చాయి. రెండు ఎఫ్‌ఎఫ్‌బీ ఫ్రీజర్లు, పరీక్షల అనంతరం నిల్వ చేసేందుకు ఫ్రీజర్లు, పరికరాలు శుద్ధి చేసే యంత్రం, డోనర్‌ కుర్చీ, రక్తం నుంచి ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మాలను విడదీసి నిల్వ చేసే ఇంకుబేటర్లు కాంపోనెంట్లు వేరుపరిచే యంత్రాలు, ఎలీసా వాషర్‌, ఎలీసా రీడర్‌ తదితర అధునాతన యంత్రాలు వచ్చాయి. వీటిలో ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మాలను వేరు చేసే యంత్రాలు మాత్రం కొద్ది రోజుల తర్వాత పని చేస్తాయిని అధికారులు తెలిపారు.


సిబ్బంది కొరత తీరాలి


కేంద్రం నిర్వహణ కోసం ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌, అటెండర్‌, డ్రైవర్‌లను మార్చి నెలలోనే ఎంపిక చేశారు. వైద్యుని నియామకం జరిగింది. మరో ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు వస్తే మిగతా పరికరాలు కూడా ఉపయోగంలోకి వస్తాయి.


జిల్లాలో ప్రయోజనం పొందే వారి


వివరాలను పరిశీలిస్తే..


తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా రోగులు : సుమారు 250 మంది ఉన్నారు. వీరికి నెల, రెండు నెలలకోసారి రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది.


ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 7,322 మంది గర్భిణుల పేర్లు నమోదు చేశారు. వీరిలో 1,389 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గుర్తించారు. ఇందులో 270 మంది రక్తం ఎక్కించుకున్నారు. ఇంకా 1,119 మంది గర్భిణులకు రక్తం అవసరం ఉంది.రక్తనిధి ఎంతో ప్రయోజనకారి


- విద్యాసాగర్‌, ఆసుపత్రి పర్యవేక్షణాధికారి


జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 30న ఉదయం 10 గంటలకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల చేతుల మీదుగా రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభిస్తాం. ఈ కేంద్రానికి అవసరమైన పరికరాలు అన్ని వచ్చాయి. సిబ్బంది నియామకం పూర్తి అయింది. ఈ రక్తనిధి కేంద్రం ముఖ్యంగా జిల్లాలోని తలసేమియా, సికిల్‌సెల్‌ రోగులకు, రక్తహీనతతో బాధపడే గర్భిణులు, బాలింతలకు ఎంతో ప్రయోజనకరం. ఇక నుంచి రక్తం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.