క్రీడలతో ఆరోగ్య జీవనం

బాపట్ల : క్రీడా పోటీల్లో పాల్గొనటం ద్వారా శారీరక దారుఢ్యం పెరిగి ఆరోగ్యంగా జీవించవచ్చని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్లలోని రక్షణ సైన్యం విలియంబూత్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న అంతర జూనియర్‌ కళాశాలల రెండ్రోజుల రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలను ఉప సభాపతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుని క్రీడాకారులుగా ఎదగాలన్నారు. క్రీడాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. క్రీడా ప్రతిభ మెరుగుపరచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని సూచించారు. ఉప సభాపతిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. పురుషులు, మహిళల జట్ల మధ్య వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో విజయం కోసం క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. కార్యక్రమంలో ఆర్‌ఐవో రామచంద్రరావు, బీఐటీ ఉప కార్యదర్శి శేఖర్‌బాబు, కళాశాల ప్రిన్సిపల్‌ విక్లీఫ్‌, కరస్పాండెంట్‌ విజయ్‌కుమార్‌, పీడీ విజ్ఞాన్‌కుమార్‌, వైకాపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డిముక్కల డేవిడ్‌ పాల్గొన్నారు.