ప్రోటీన్లను తొలగిస్తే.. మందగిస్తున్న అంకుర ప్రక్రియ!

లండన్‌: విత్తనాలు మొలకెత్తడం ఓ అద్భుత ప్రక్రియ. నీరు తగిలిన నిమిషాల వ్యవధిలోనే అవి క్రియాశీలమవుతాయి. ఆహారం-శక్తి తయారీ కోసం లోలోపల పలు రసాయనిక చర్యలు ప్రారంభమవుతాయి. విత్తనాలు అంకురించే తొలి దశల్లో చోటుచేసుకునే ఈ మార్పుల వెనుక పలు ప్రోటీన్ల ప్రభావం దాగి ఉంటుందని జర్మనీలోని మున్‌స్టర్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం గుర్తించింది. తాజా అధ్యయనంలో భాగంగా పరిశోధకులు తడి, పొడి విత్తనాలపై వేర్వేరుగా విస్తృత పరిశోధనలు నిర్వహించారు. ఆధునిక సాంకేతిక విధానాలను ఉపయోగిస్తూ విత్తుల నుంచి కొన్ని కీలక జన్యువులను వేరు చేసి పరిశీలించారు. ప్రోటీన్లను తొలగించిన విత్తనాల్లో అంకుర ప్రక్రియ.. సాధారణ విత్తనాలతో పోలిస్తే మందగిస్తున్నట్లు తేల్చారు. అనుకూల పరిస్థితుల్లోనే మొలకెత్తేలా విత్తనాలను నియంత్రించి.. మెరుగైన పంట దిగుబడులను పొందే దిశగా సరికొత్త విధానాలను రూపొందించేందుకు తాజా అధ్యయన ఫలితాలు దోహదపడే అవకాశాలున్నాయి.