ఆరోగ్యం కాపాడుకోండి

విజయవాడ : చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు స్థానిక వీపీ సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలబాలికల అథ్లెటిక్స్‌ పోటీలు, రాష్ట్ర స్థాయి అధ్యాపకుల ఆటల, క్రీడా పోటీల ప్రారంభ సభకు శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈఏడాది ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అంతర్‌ కళాశాలల క్రీడ, ఆటల పోటీలను ఇక మీదట ప్రతి సంవత్సరం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి పి.రవికుమార్‌ అధ్యక్షత వహించగా.. వీపీ సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ కన్వీనర్‌ పర్వతనేని ప్రభాస్‌, శాయ్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ డీఎన్‌వీ వినాయక్‌ప్రసాద్‌, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ సంఘం అధ్యక్షుడు ఎ.ఆనంద్‌కుమార్‌ అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథి వి.రామకృష్ణ పోటీలకు విచ్చేసిన క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. బాలబాలికలకు అథ్లెటిక్స్‌, అధ్యాపకులకు అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, టెన్నికాయిట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.