ఈఎస్‌ఐ ‘మందులు’.. చెత్త పాలు కాలపరిమితి పేరిట లక్షల విలువైన ఔషధాల కాల్చివేత

ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం


 కార్మికుల అవసరానికి ఇవ్వలేదని ఆరోపణ


 కాగజ్‌నగర్‌ :ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు అందించాల్సిన ఔషధాలు 'చెత్త' పాలుజేశారు. లక్షల విలువైన మందులు కాల్చిబూడిద చేశారు. ఇదీ కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ ఈఎస్‌ఐ(కార్మిక రాజ్య బీమా ఆసుపత్రి) సిబ్బంది నిర్వాకం. ఆసుపత్రిలోని ఔషధాల గోదాంలోని రక్తహీనత, క్యాల్షియం, ఆయుర్వేదిక్‌, ఇతర మందులు, రక్త పరీక్షలకు సంబంధించిన పరికరాలను కాలపరిమితి ముగిసినందున వాటిని కుప్పగా పోసి, నిప్పంటించారు. గుట్టుచప్పుడు కాకుండా ఆ మందులు కొన్నింటిని కాల్చివేయగా, మరికొన్ని మందుల డబ్బాల సీల్‌ను కూడా తొలగించకుండానే చెత్త కుప్పల్లో పడవేశారు.

కార్మికులకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ పట్టణంలో ఈఎస్‌ఐ ఆసుపత్రిని స్థాపించారు. ఎస్పీఎం శాశ్వత, ఒప్పంద కార్మికులు, మున్సిపల్‌, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు, రైస్‌ మిల్లులు, ఇతర కార్మికులు దాదాపు అయిదు వేలకుపైగా ఈఎస్‌ఐ కార్డుదారులున్నారు. వారు ప్రతి నెల తమ వేతనాల నుంచి ఈఎస్‌ఐ ప్రీమియం చెల్లిస్తున్నారు. ఆసుపత్రిలో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌తో పాటు, పది మంది వైద్యులు, 65 మంది స్టాఫ్‌నర్సులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. స్థానికంగానే ఉంటూ వైద్య సేవలు అందించాల్సిన సూపరింటెండెంట్‌తో పాటు, వైద్యులు పదిహేను రోజులకు ఒక్కరోజు వచ్చి హాజరుపట్టికలో సంతకం చేసి పోతున్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రికి కార్మికులు, ఇతరులు రావడం మానేశారు. ఆసుపత్రికి మంజూరైన రూ.లక్షల విలువైన ఔషధాలు రోగులకు పంపిణీ చేయక పోవడంతో కాలపరిమితి ముగుస్తున్నాయి. ఏటా ఆసుపత్రి సిబ్బంది కాలపరిమితి పేరిట నిప్పంటించి, రికార్డుల్లో మాత్రం కార్మికులకు పంపిణీ చేసినట్లు నమోదు చేసుకుంటున్నారు. గతేడాది సైతం లక్షల మందులను కాల్చిబూడిద చేయగా, కార్మికులు సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇన్‌ఛార్జి ఈఎస్‌ఐ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ను 'న్యూస్‌టుడే' సంప్రదించగా, విచారణ జరుపుతామని సమాధానమిచ్చారు.


కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి ఆవరణలో రూ.లక్షల విలువైన ఔషధాల (మందులు)ను ఆసుపత్రి సిబ్బంది కాలపరిమితి ముగిసినందున నిప్పంటించారు. ఇందులో రక్తపరీక్షలు, ఆయుర్వేద, తదితర మందులు ఉన్నాయి. డబ్బాలు సీల్‌ తీయకముందే ఇలా వాటిని గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రి సిబ్బంది కాల్చివేశారు.