రైల్వే ఆస్పత్రిలో కార్పొరేట్‌ వైద్య సేవలు..!



విజయవాడ : రైల్వే ఉద్యోగులు, పింఛనర్లకు శుభవార్త. విజయవాడ ప్రధాన రైల్వే ఆస్పత్రిలో కార్పొరేట్‌ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆస్పత్రిలో గత పదేళ్లుగా వైద్య నిపుణులు కొరత కారణంగా రైల్వే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయట ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తూ లక్షలు ఖర్చు చేసిన కేసులు అనేకం ఉన్నాయి. ఎట్టకేలకు కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా కార్పొరేట్‌ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు కొన్ని విభాగాల సేవలు మాత్రమే అందుబాటులో ఉండగా ప్రస్తుతం ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు మరిన్ని పెరిగాయి. ఇకపై వారంలో ఐదు రోజులు వివిధ విభాగాలకు చెందిన కార్పొరేట్‌ ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులు రైల్వే ఆస్పత్రిలో సేవలు అందిస్తారు.


 


అందరూ ఉపయోగించుకోవాలి
గతంలో వైద్య చికిత్సల కోసం సికింద్రాబాద్‌ వెళ్లాల్సి వచ్చేది. తాము పలు మార్లు జీఎం, డీఆర్‌ఎంతో ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య దృష్టికి తీసుకెళ్లి.. కార్మికులకు విజయవాడలోనే కార్పొరేట్‌ వైద్య సేవలు అందేలా కృషి చేశాం. ఈ సేవలు అందరూ ఉపయోగించుకోవాలి. ఎక్కడైనా సేవల విషయంలో లోపాలు ఉంటే కార్మికులు నేరుగా ఆస్పత్రి సీఎంఎస్‌ను కలిసి ఫిర్యాదు చేయవచ్చు.



-  సత్యనారాయణ, ఎంప్లాయీస్‌ సంఘ్‌ కార్యదర్శి.



ఇలా చేస్తే చాలు...


విజయవాడ రైల్వేడివిజన్‌ పరిధిలో 43 వేల మంది రైల్వే కార్మికులు, పింఛనర్లు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు తమ 'ఉమిడ్‌' హెల్త్‌కార్డును తీసుకొచ్చి నేరుగా డాక్టర్‌ను కలవచ్చు. వారు రోగ నిర్ధారణను బట్టి అవసరమైన మేరకు రోగులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తారు.