ఆరోగ్యవంతమైన జీవనవిధానంతో మెరుగైన సేవలు

పోలీసుక్వార్టర్స్‌: శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారంతా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని విశాఖరేంజి డీఐజీ ఎల్‌కేవీ రంగారావు అన్నారు. ఎచ్చెర్ల మండలం పోలీసు క్వార్టర్స్‌ వద్ద గల ఏఆర్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు చెడు అలవాట్లుకు బానిస కాకుండా మంచి ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పోలీసులు అన్ని విభాగాల్లోనూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. అనంతరం సాయుధ పోలీసు మైదానంలో గౌరవ వందనం స్వీకరించి పోలీసులు ప్రదర్శించిన పరేడ్‌, వెపన్‌ డ్రిల్‌, లాఠీ డ్రిల్‌, పి.టి డ్రిల్‌, ఆర్మ్‌డ్రిల్‌, స్వాడ్‌ డ్రిల్‌, పోలీసు బ్యాండ్‌ వంటి విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా కార్యాలయం దస్త్రాలను, డాగ్‌ స్క్వాడ్‌, పోలీసు స్టోర్‌, గెస్ట్‌ హౌస్‌, ఆయుధ సముదాయ గదిని, పోలీసు వాహనాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, డీఎస్పీ ఎన్‌.ఎస్‌.ఎస్‌.వి.శేఖర్‌, ఏఆర్‌ ఆర్‌ఐ ఆర్‌.కోటేశ్వరబాబు, ఎస్సైలు జంగాలు, కోటి, నాగరాజు, పోలీసులు పాల్గొన్నారు.