జోగింపేట: నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగినా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉన్న యువకుడి జీవతాన్ని విధి వక్రీకరించింది. ఉపాధి పొందుతున్న చోటే ఊపిరి తీసింది. ఆయననే నమ్ముకుని ఉన్న అయిదుగురి జీవనాధార ఆశల్ని చిదిమేసింది. సీతానగరం మండలం జోగింపేట గ్రామానికి అజయ్‌కుమార్(32) బీఎసీ్సీ పూర్తి చేశాడు. కుటుంబానికి ఆసరాగా ఉండాలని విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రగా 2008లో చేరాడు. ఆసుపత్రిలో సేవలు అందిస్తూ ఎంసీఏ పూర్తి చేశాడు. ఉన్నత స్థితిలో నిలవాలని 2012లో ఆరోగ్య మిత్ర ఉద్యోగాన్ని వదిలి హైదరాబాదు చేరాడు. ఉద్యోగ శిక్షణ పొందుతూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. గతేడాది వివాహం కావడంతో తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో విశాఖలోని ఫార్మా కంపెనీలో చేరాడు. విధి నిర్వహణలో అసువులు బాసడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. సోదరికి వివాహం కావడంతో వృద్ధ తల్లిదండ్రులు, భార్య దిక్కులేని వారిగా మిగిలారు. అజయ్‌కుమార్ మృతి చెందాడన్న సమాచారంతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.