ఆసిఫాబాద్: క్షయ నిర్ధారణ పరీక్షలు అన్ని ఆసుపత్రుల్లో నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కుమురం బాలు పేర్కొన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద క్షయ వ్యాధిపై నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులు, వారికి అందుతున్న సేవలు, మందుల వాడకం, నెల నెల చెల్లించే పారితోషకాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోగి సక్రమంగా మందులు వాడేలా అవగాహన కల్పించాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి రోగి ఇంటికి వెళ్లైనా క్షయ మందులు అందించాలన్నారు. అనంతరం వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు సుధాకర్ నాయక్, సునీల్‌రావు సిబ్బంది పాల్గొన్నారు.