వైద్యుల పరుగులు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలతో మార్పు

నిజామాబాద్‌ : జిల్లా ఆసుపత్రిలో శనివారం పాలనాధికారి నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేసి వైద్యులకు మెమోలు ఇవ్వడంతో సోమవారం ఆసుపత్రికి ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చారు. బయోమెట్రిక్‌ ఆధారంగా మొత్తం 111 మంది వైద్యులు, సిబ్బందికి మెమోలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు సెలవుపై ఉండగా.. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన కొందరి పేర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దీన్‌దయాళ్‌ బంగ్‌ పూర్తి వివరాలు సేకరించి పరిశీలించారు. విధులకు రాని వారిలో 34 మంది వైద్యులు, 10 మంది డీఎన్‌బీ పీజీలు, 8 మంది పీజీలు, 10 మంది ఎస్సార్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ నివేదికను జిల్లా పాలనాధికారికి ఇచ్చినట్లు సమాచారం. మెమోలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా శనివారం హైదరాబాద్‌ నుంచి వచ్చే కొందరు వైద్యులు రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారు. ఈ రైలు తరచూ ఆలస్యంగా వస్తుంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌ నుంచి వచ్చే వైద్యులు ఒక్కో కార్లో నలుగురు కలిసి వచ్చినట్లు సమాచారం. ఇకపై రోజుకు ఒకరి కారులో ఇలా రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది