కడప : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ లర్నల్స్ కార్యక్రమం ద్వారా జిల్లాకు సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు యూకేలోని నేషనల్ హెల్త్ సిస్టంలో నర్సుగా పనిజేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధిసంస్థ అధికారి సంపత్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీఎల్‌పీ కార్యక్రమం కోసం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సమక్షంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో 2019 అక్టోబరు 16వ తేదీ యూకే ఆరోగ్యశాఖ ఎగ్జిక్యూటివ్ నాన్ డిపార్ట్‌మెంటల్ పబ్లిక్ బాడీ అయిన హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఎంపికైన అభ్యర్థులకు మూడు సంవత్సరాల కాంట్రాక్టు లభిస్తుందన్నారు. బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులైన, ప్రస్తుత చివరి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసి ఆసక్తి కలిగిన అభ్యర్థులు హెచ్‌టీటీపీఎస్:డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఐఎన్/హెచ్‌వోఎంఈ/ఎన్‌యూఆర్‌ఎస్‌ఈ రిజిస్ట్రేషన్ లింక్‌లో వారి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.