ఆదిలాబాద్ : అర్ధరాత్రి పూట ఇంట్లోనే కాన్పు కాగా శిశువు ప్రాణాపాయ స్థితిలో జన్మించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం రెండు రోజులుగా శిశువు ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించే ఆర్థిక స్థోమత లేని కుటుంబం దీనంగా తమ కుమారుడిని చూసుకుంటూ విలపిస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడో కాదు జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భుక్తాపూర్‌లో నివాసముండే మాన్‌సింగ్ పట్టణంలో తోపుడు బండి వ్యాపారం చేసుకొని జీవిస్తుంటాడు. అతడి భార్య మున్నీకి శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. ఇంటి వద్ద వాకిట్లోనే అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రసవమైంది. పొరుగువారు వెంటనే 108కి సమాచారం అందించారు. వాహనం రావటానికి ముప్పావు గంటకు పైగా అయింది. అప్పటి వరకు ఆమె గడ్డ కట్టే చలిలో వణుకుతూ అలాగే కూర్చోవలసి వచ్చింది. ఆనక వచ్చిన 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. అయితే ఆమెకు జన్మించిన శిశువు హెర్నియేషన్‌తో(కడుపులోని భాగాలన్నీ బయటకు వచ్చి) జన్మించాడు. దీంతో వెంటనే వైద్యులు ఆ శిశువును రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో చేర్చారు. స్థానికంగా ఆ చిన్నారికి శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితులు లేకపోవటంతో హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. కాని అరకొర సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ కుటుంబం తమ కొడుకును ఇతర ప్రాంతాలకు తరలించి చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేక ఇక్కడే ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. స్థానిక వైద్యులు చిన్నారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.