మహబూబాబాద్: జిల్లాలోని దివ్యాంగులకు జనవరి నుంచి ప్రతి శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి గ్రామీణాభివృద్ధి శాఖాధికారి సూర్యనారాయణ సోమవారం తెలిపారు. నూతనంగా సదరం ధ్రువీకరణ పత్రాలను పొందడంతో పాటు పాత ధ్రువీకరణ పత్రాలను పునరుద్ధరించుకునేందుకు ప్రత్యేక విధానం అమలు చేస్తున్నామన్నారు. నూతన విధానం ప్రకారం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2020 జనవరి 3లోగా ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకున్నవారు మీ సేవ కేంద్రాల్లో రూ.35 చెల్లించి స్లాట్ బుకింగ్ చేయించుకోవాలన్నారు. ఆ తేదీ ప్రకారం జిల్లా ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం ఒక్కో విభాగానికి సంబంధించి దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ బోర్డు ద్వారా ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని తెలిపారు.