టొరంటో: పేగు సంబంధిత క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే సరికొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధకులు ముందడుగు వేశారు. పేగు క్యాన్సర్ల వృద్ధికి కారణమవుతున్న ఓ కీలక ప్రోటీన్‌ను గుర్తించారు. సాధారణంగా ఏపీసీ అనే జన్యువులో ఉత్పరివర్తనాలతో 'బీటా-క్యాటెనిన్' ప్రోటీన్ స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా క్యాన్సర్ ముప్పు అధికమవుతుంది. కణాల కేంద్రకంలోకి బీటా క్యాటెనిన్ ఎలా ప్రవేశిస్తోందనే విషయంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఈ అంశంపై విస్తృత పరిశోధనలు నిర్వహించింది. ఇంపోర్టిన్-11 అనే ప్రోటీన్.. కేంద్రకాల్లోకి బీటా క్యాటెనిన్‌ను చొప్పిస్తున్నట్లు గుర్తించింది. ఫలితంగా క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని తెలిపింది. ఇంపోర్టిన్-11కు అడ్డుకట్ట వేయగలిగితే కణితి పెరుగుదలను నియంత్రించవచ్చునని వివరించింది.