రాంనగర్: పిల్లల వైద్య నిపుణులు సీనియర్ల సూచనలు పాటిస్తూ, మెరుగైన వైద్యసేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డా.రమేశ్‌రెడ్డి సూచించారు. శనివారం రాత్రి హోటల్ మారియట్ కన్వెన్షన్ హాలులో 'ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్' (ఐఏపీ) 25వ వార్షికోత్సవ సందర్భంగా జంట నగరాల పిల్లల వైద్య నిపుణుల సమాఖ్య సమ్మేళనం నిర్వహించారు. సుమారు 400 మంది పిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు.డా.రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదన్నారు. ఇలాంటి సదస్సుల వల్ల సీనియర్ వైద్యుల సూచనలు అందుతాయన్నారు. నిలోఫర్ ఆస్పత్రిలోని ఆడిటోరియాన్ని అభివృద్ధి చేసుకొని, అక్కడే సదస్సులు నిర్వహించుకోవచ్చన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డా.రవీంద్ర రెడ్డి, వైద్యులు సీఎన్ రెడ్డి, డా.రంగనాథ్, డా.రంగయ్య, డా.ఎస్.భాస్కర్, డా.నిర్మల, డా.అర్జున్, డా.సంజయ్, డా.అజయ్‌కుమార్, డా.యశ్వంత్‌రావు, డా.ఎన్.ఎల్.శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన వైద్యులు డా.వై.సి.మాతృ, డా.రవీంద్రరావు, డా.అమరేశ్, డా.రాఘవరావు, డా.ఎన్.రవికుమార్ సత్కరించారు.